Kurnool Crime News | కర్నూలు: కుమారుడి ప్రేమ, పెళ్లి వ్యవహారంలో యువకుడి తల్లిపై జరిగిన అమానుష ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితురాలు గోవిందమ్మను కల్లంకుంట గ్రామంలోకి వచ్చిందని సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమె ఇంటి వద్దకు వెళ్లి తీసుకొచ్చి స్తంభానికి కట్టేసి కొట్టారని తెలిసిందే. అయితే బాధితురాలు గోవిందమ్మను కొట్టిన వారందరూ మహిళలే అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో దాదాపు పది మంది మహిళలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. యువతి బంధువుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. మరో ఎనిమిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు దళిత మహిళపై ఇలా అమానుషంగా దాడి చేయడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా దళిత సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందమ్మకు న్యాయం చేయాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని దళిత సంఘం నాయకులు హెచ్చరించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు గోవిందమ్మను దళిత సంఘం నేతలు పరామర్శించారు


అసలేం జరిగిందంటే.. 
బీసీ వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని దళిత యువకుడి తల్లిని విచక్షణారహితంగా చెట్టుకు కట్టేసి కొట్టారు. అంతటితో ఆగకుండా మతిస్థిమితం లేని వ్యక్తితో తాళి కట్టించబోయిన అమానుష ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.  కర్నూలు జిల్లా పెద్దకడుగూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన దళిత యువకుడు ఈరన్న అదే గ్రామానికి చెందిన బీసీ వర్గానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. గ్రామ పెద్దలకు చెబితే కులాంతర వివాహాన్ని ఒప్పుకోరున్న అనుమానంతో ఈరన్న, యువతిపెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలియడంతో ఊరి పెద్దలు పంచాయతీ పెట్టి దళిత వర్గానికి చెందిన గోవిందమ్మ తన కుమారుడు ఈరన్నను గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో చేసేది లేక గోవిందమ్మ ఎమ్మిగనూరు పట్టణంలో తలదాచుకోగా ప్రేమించిన యువకుడు ఈరన్న యువతని తీసుకొని బెంగళూరులో నివాసం ఉంటున్నాడు.


పంచాయతీ జరిగిన ఆరు నెలలకు గోవిందమ్మ సొంత ఊరికి పని నిమిత్తం వెళ్లింది. అదే గ్రామానికి చెందిన యువతి తల్లిదండ్రులు, వారి వర్గం గోవిందమ్మను ఇంటి దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్లి ఒక స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా చంటి సినిమా రేంజ్ లో గోవిందమ్మకు అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తితో వివాహం చేయబోయారు. కొందరు గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జరుగుతున్న అమానుషాన్ని అడ్డుకున్నారు. గోవిందమును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


 దర్యాప్తు చేస్తున్న పోలీసులు


ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి గోవిందమ్మ పై దాడి చేసిన వారిని పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. మరోవైపు పంచాయతీ చేసిన పెద్దలు ఎవరు ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు దాచారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. గోవిందమ్మ మహిళ కావడంతో బిసి వర్గానికి చెందిన చాకలి ఈరన్న వర్గీయులు మొత్తం పదిమంది గోవిందమ్మను దాడి చేసిన ఘటనలో పోలీసులు గుర్తించారు వారిలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read: ప్రేమ వ్యవహారం - యువకుడిపై కత్తితో దాడి చేయించిన యువతి, తిరుపతిలో దారుణం


 నాకు న్యాయం కావాలి: బాధితురాలు గోవిందమ్మ 


 తనకు భర్త లేడని నాకు ఒక కుమారుడు ఈరన్న ఉన్నాడని నా కొడుకు మా గ్రామానికి చెందిన చాకలి ఎర్రన్న కుమార్తె నాగలక్ష్మి  ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటనపై నాగలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇద్దరు ప్రేమికులను పిలిపించి పంచాయతీ చేసి ఎవరి ఇంటికి వారిని పంపించారు. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడవకముందే.. నాకు కూడా తెలియకుండా నా కొడుకు ఈరన్న కూతురు పెళ్లి చేసుకున్నారు అని వెల్లడించింది. పెళ్లి చేసుకున్న అనంతరం  గ్రామం వదిలి వెళ్ళిపోయారు.దీంతో ఆగ్రహానికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులు, మరియు గ్రామ పెద్దలు ఒక్కటై గ్రామ బహిష్కరణ చేశారని పేర్కొంది. పని నిమిత్తం నేను మా ఊరికి వస్తే విచక్షణ రైతంగా నన్ను జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి చీర విప్పి స్తంభానికి కట్టేసి కొట్టడమే కాకుండా మతిస్థిమితం లేని వ్యక్తితో పెళ్లి చేయబోయారని ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని శిక్షపడేలా చేయాలని భాయతాలు గోవిందమ్మ డిమాండ్ చేశారు.