Krishna District Crime News: కృష్ణా జిల్లా గవన్నరానికి చెందిన ఓ బాలికకు.. అక్కడి ఓ పాస్టర్ మాయ మాటలు చెప్పి ట్రాప్ చేశాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లిపోయాడు. కానీ బంధువులు భాగ్యనగరం వెళ్లి మరీ బాలికను, పాస్టర్ ను తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాస్టర్ ను అరెస్ట్ చేసి, బాలికకు కౌన్సిలింగ్ ఇప్పించారు.
క్యాన్సర్ తో మృతి చెందిన పాస్టర్ భార్య..
నూజివీడులో చర్చి పాస్టర్ గా నాగేశ్వర్ రావు వ్యవహరిస్తున్నారు. కొంత కాలం క్రితమే ఆయన భార్య క్యాన్సర్ తో మృతి చెందింది. అప్పటి నుంచి ఆయన తన 20 ఏళ్ల వయసున్న పిల్లలతో కలిసే జీవిస్తున్నాడు. అయితే సదరు బాలికకు చాలా రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు నూజివీడు చర్చికి తీసుకొచ్చారు.
దీన్నే అవకాశంగా మార్చుకున్న పాస్టర్ నాగేశ్వర్ రావు మైనర్ బాలికను లోబర్చుకున్నాడు. విషయం గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులు.. పాస్టర్ కు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇక్కడే ఉంటే మళ్లీ మళ్లీ పాప కోసం వస్తాడని.. బాలికను బంధువుల ఇంటికి పంపించారు. అయినా పాస్టర్ మాత్రం ఆగలేదు. బాలికను ఎక్కడి పంపించారో అని తీవ్రంగా గాలించాడు. తనకు తెలిసిన వారితో ఎంక్వయిరీ చేయించాడు. రెండు నెలల గాలించి చివరకు బాలిక గన్నవరం మండలం ముస్తాబాద్ లో గుర్తించాడు. తన పిన్ని వాళ్ల ఇంట్లో ఉందని గుర్తించాడు.
పాస్టర్ ను అరెస్ట్ చేసి బాలికకు కౌన్సిలింగ్..
ఇక ఆలస్యం చేయకుండా ముస్తాబాద్ గ్రామం చేరుకున్నారు పాస్టర్. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను తీసుకొని ఊరి నుంచి బయటపడ్డాడు. అనంతరం బాలికతో హైదరాబాదుకు పారిపోయారు. అయితే పాస్టర్ నాగేశ్వరరావు పాపను తీసుకొని హైదరాబాద్ వెళ్లాడని, అక్కడే ఉన్నారనే సమాచారం తెలుసుకున్నారు ఆమె బంధువులు. వెంటనే భాగ్య నగరానికి చేరుకున్నారు. పాస్టర్, బాలిక ఉన్న ప్రాంతానికి వెళ్లి గొడవ చేసి మరీ బాలికను తీసుకొచ్చేశారు. ఇంటికి రాగానే వెంటనే వెళ్లి గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు పాస్టర్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.
నెల్లూరులో బాలిక కిడ్నాప్..
నెల్లూరు జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఆ బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ ని పట్టుకున్నారు. తల్లిదండ్రుల ఆందోళనను తీర్చారు. జిల్లా పోలీసులు చాకచక్యంతో కిడ్నాప్ కేసుని ఛేదించి మైనర్ బాలికను సురక్షితంగా విడిపించారు.
అసలేం జరిగింది..?
మంగళవారం ఉదయం నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలం ఏసీ కాలనీ లో అప్పర్ ప్రైమరీ స్కీల్ లో మూడో తరగతి చదువుకునే బాలిక ను ఓ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. బాలికకు తాను మేనత్తను అని చెప్పి స్కూల్ నుంచి పాపను తీసుకెళ్లింది. బాలికకు తినుబండారాలు కొనిచ్చి తిరిగి తీసుకొస్తానని ఆ మహిళ స్కూల్ టీచర్లకు చెప్పి పాపను తీసుకెళ్లింది. ఆ తర్వాత ఎంత సేపటికి ఆమె తిరిగి రాలేదు. దీంతో పాపకోసం వేచి చూసిన టీచర్ చివరకు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు వారు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. దుత్తలూరు నుంచి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు జల్లెడ పడ్డారు. చివరకు బైక్ పై మైనర్ బాలికను తీసుకెళ్తున్న ఓ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద పోలీసులకు చిక్కారు. వెంటనే పాపను పోలీసులు దుత్తలూరుకి తీసుకొచ్చారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.