Telangana Latest News | జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు ఆలయం వద్ద వేగంగా వచ్చిన ఒక లారీ, RTC బస్సు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయి డ్రైవర్ లోపలే చిక్కుకుపోయాడు. అతనిని బయటకు తీసేందుకు స్థానికులు ఇనుప రాడ్లు, తాళ్లను ఉపయోగిస్తూ 30 నిమిషాలకు పైగా శ్రమించాల్సి వచ్చింది.
కరీంనగర్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల వైపు వెళ్తుండగా లారీ ఢీకొనడంతో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో దాదాపు 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తరువాత బాధితులు సహాయం కోసం కేకలు వేశారు. ఒక ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ‘మేం పెద్ద శబ్ధం రాగానే విని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాం. బస్సు డ్రైవర్ శరీరం నుంచి రక్తం కారుతోంది. బస్సు లోపల ప్రయాణికులు చిక్కుకుపోయారు’ అని తెలిపారు.
కొండగట్టు హైవేపై రోడ్డు ప్రమాదం
మల్లియల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురు ఢీకొన్న ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. కొన్ని నిమిషాల్లోనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసేందుకు కిటికీలు పగలగొట్టారు. వీరిలో 20 మందిని చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన లారీ డ్రైవర్‌ను కొంతసేపు శ్రమించి బయటకు తీయగలిగారు.
Also Read: Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘాట్ రోడ్డు దిగుతున్న సమయంలో లారీ అదుపు తప్పి బస్సు లేన్‌లోకి వచ్చి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. లారీ వేగం, బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.
