Konaseena Internet Shut Down : కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజా అరెస్టులపై కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ప్రకటన విడుదల చేశారు. అమలాపురం అల్లర్లు కేసులో గురువారం మరో 20 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 91 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గత నెల 24వ తేదీన అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో మొత్తం ఏడు ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు అయినట్లు పేర్కొన్నారు. నిందితుల గుర్తింపు, అరెస్ట్ కు ఏడు దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కోనసీమలోని ఎనిమిది మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తునట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలయిన అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం మండలాల్లో ఇంటర్నెట్ నిలిపివేత వేసినట్లు వెల్లడించారు. 


రెచ్చగొట్టే పోస్టింగ్ లు పెడితే కఠిన చర్యలు


సున్నితమైన విషయాలు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, ఒక వర్గాన్ని కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాంటి పోస్టులు పెట్టేవారితో పాటు ఆ గ్రూపుల అడ్మిన్లపైనా కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా అలాంటి అభ్యంతరకర పోస్టులు పెడితే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు. అలా కాకుండా పోస్టులు పెట్టిన వారి ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం, కొట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేసుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, చదువులు పూర్తయినవారే ఉన్నారన్న ఎస్పీ.. భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు వస్తే పోలీసు వెరిఫికేషన్‌లో అనర్హులవుతారన్నారు. విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పార్ట్‌లు కూడా మంజూరు కావని పేర్కొన్నారు. .  


అసలేం జరిగింది?


కోనసీమ జిల్లా పేరు మార్చడంపై ఇటీవల చిన్నాగా ప్రారంభమైన ఆందోళన హింసాత్మకంగా మారింది. మొదట పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు క్రమంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తొలుత మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటిని ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపైకి దూసుకెళ్లారు. కలెక్టరేట్‌ ముట్టడి పేరుతో కోనసీమ జిల్లా జేఏసీ చేపట్టిన ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమలాపురంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా పేరు మార్పును అంగీకరించబోమంటూ ఉద్యమించారు. ముఖ్యంగా యువత ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. ఆందోళన వద్దని పోలీసులు వేడుకుంటున్నా ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ఓ దశలో లాఠీ ఛార్జ్ చేసినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం భయపడలేదు. లాఠీ దెబ్బలతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. అప్పటి వరకు కాస్త ఆందోళకరంగా సాగిన ముట్టడి రక్తసిక్తమైంది.