Khammam Crime News: డిగ్రీ రెండో సంవత్సరం చదివే విద్యార్థిని ఆటో డ్రైవర్ ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేశాడు. నువ్వు కూడా ప్రేమించాలంటూ తెగ చిరాకు పెట్టాడు. విషయం గుర్తించిన తల్లిదండ్రులు అమ్మాయిని హాస్టల్ లో చేర్పించారు. అక్కడ మరో యువకుడి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. రోజూ ఫోన్లు, మెసేజ్లు, వెంటపడడం వంటివి చేసే సరికి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమెను వాళ్ల అమ్మమ్మ ఇంటికి పంపించారు. అక్కడ కూడా వీరి వేధింపులు ఆగలేదు. ఫోన్లు, మెసేజ్ లు, అభ్యంతరకర ఫొటోలు పంపిస్తూ.. మరంత చిరాకు పెట్టారు. ఎన్ని ఊర్లు తిరిగినా ఆకతాయిల వేధింపులు తగ్గకపోవడంతో విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చికిత్స పొందతూ ఈరోజు మృతి చెందింది. 


అసలేం జరిగిందంటే..?


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలుకు చెందిన బొప్పిశెట్టి సుజాత, నర్సింహా రావులకు 19 ఏళ్ల కుమార్తె సాయికీర్తి ఉంది. ఆమె ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే పాల్వంచకు చెందిన ఆటో డ్రైవర్ రోహిత్ కొంత కాలంగా ఆమెను ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. చాలా రోజులుగా వేధింపులు ఎక్కువవడంతో.. విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఖమ్మంలోని వసతి గృహంలో ఉంచి చదివించారు. అక్కడ తరుణ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. రోజూ ఇలాగే కొనసాగేసరికి భరించలేని ఆమె మరోసారి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కుమార్తెను కుమార్తెను మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తహసీల్దార్ బంజరలోని అమ్మమ్మ వీరమ్మ ఇంటికి పంపారు. అక్కడి నుంచే ఆమె రోజూ బస్సు లేదా ఆటోలో కళాశాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అయినా రోహిత్, తురణ్ ల వేధింపులు కొనసాగించారు. 


దీంతో సాయికీర్తి తీవ్ర మనోవేదనకు గురైంది. ప్లీజ్ ఆపండి అంటూ బతిమాలినా వాళ్లు.. ఆమె ఫోన్ కు అభ్యంతరకర సందేశాలు, ఫొటోలు పంపిస్తూ ఇబ్బంది పెట్టారు. తానేం చేసినా, ఎన్ని ఊళ్లు తిరిగినా వారి వేధింపులు తగ్గవని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈనెల 24వ తేదీన ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే కాసేపటికే ఆమె అమ్మమ్మ ఇంట్లోకి వెళ్లగా.. సాయికీర్తి అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో వీరమ్మ భయపడిపోయి గట్టిగా గట్టిగా ఏడ్వడంతో స్థానికులు వచ్చారు. సాయికీర్తిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ లో చేర్చారు. పరిస్థితి విషమించిందని, ఇక ఏం చేసినా ఆమె బతకడం కష్టమని అక్కడి వైద్యులు చెప్పగా.. మరుసటి రోజు అంటే మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి యువతి మృతి చెందింది. మృతురాలి బాబాయ్ ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డోర్నకల్ ఎస్స్ రవి కుమార్ తెలిపారు.