Karimnagar News: కరీంనగర్‌లోని ఎన్టీపీసీలో దారుణం చోటుచేసుకుంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి విడిపించి తీసుకురావాలంటూ భర్తను కోరిన ఓ భార్యను హతమార్చాడో దుర్మార్గుడు. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి వాటి నుంచి బయట పడలేక చివరికి జీవితాన్నే నాశనం చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే ఎన్టీపీపీలోని సంజయ్ గాంధీ నగర్ కి చెందిన సుందరగిరి రాజేష్ ఎలిగేడుకి చెందిన రక్షితను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లికి ముందే భూపాలపల్లిలో పనిచేసిన అతనికి ఆర్థికంగా తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయి. అప్పులు ఎక్కువ కావడంతో అక్కడి నుండి తిరిగి గోదావరిఖనిలోని అడ్డగుంట పల్లిలో కుల వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వరుసగా వచ్చిన ఆర్థిక కష్టాలతో అప్పులు క్రమక్రమంగా పెరిగి ఇంట్లో గొడవలకు దారి తీశాయి. దీంతో తాత్కాలికంగా వాటి నుండి బయట పడడానికి తన భార్య రక్షిత (25) అలియాస్ కల్పన వద్ద ఉన్న 5 తులాల బంగారాన్ని కుదువపెట్టి తనకు డబ్బు ఇచ్చిన వారికి చెల్లించాడు.
అయితే తమ పుట్టింట్లో ఫంక్షన్ ఉండడంతో తనకు బంగారం అవసరం ఉందంటూ రక్షిత పదేపదే రాజేష్ ని కోరింది. తన ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం ఏమని చెప్పాలి అంటూ రాజేష్ ను నిలదీసేది. ఈ క్రమంలో మళ్ళీ గట్టిగా అడగడంతో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. విచక్షణ కోల్పోయిన రాజేష్ రక్షితను పక్కనే ఉన్న స్క్రూ డ్రైవర్ తో గొంతులో దారుణంగా పొడిచాడు. రక్తం మడుగులో రక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, విషయం బయటపడుతుందనే భయంతో ఇంటికి తాళం వేసి రాజేష్ పరారయ్యాడు. తిరిగి ఎవరిని కాంటాక్ట్ కాలేదు.
మంగళవారం ఉదయం ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు తాళం బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా హత్య చేసిన విషయం బయటపడింది. వీరిద్దరికీ రెండేళ్ల కుమారుడు ఉండగా తల్లికి ఏమైందో తెలియక ఆ బాలుడి రోదన చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు స్వరూప్ రాజ్, కుమార్, శరణ్య, లక్ష్మీ ప్రసన్న పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.