Kamareddy Crime News: అమాయక ప్రజల బలహీనతలను, అనారోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దొంగ బాబా కడమంచి నర్సింలుతో పాటు అతని అనుచరుల పాపం పండింది.  నీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి.. ఆ నిధులపై నాగదేవత కాపలా ఉంది.. వెంటనే పూజలు చేయకపోతే మీ కుటుంబంలో చావు సంభవిస్తుంది అని బెదిరించి దోచేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ ముఠా చేసిన కిడ్నాప్‌లు, దోపిడీల చిట్టాను మీడియా ముందు ఉంచారు.           

Continues below advertisement

లంకె బిందెలు వెలికి తీస్తామని చెప్పి మాయమాటలు          

నిజామాబాద్ జిల్లా ఓన్నాజిపేట గ్రామానికి చెందిన బీరవ్వ అనే మహిళను ఈ ముఠా తన మాయమాటలతో బుట్టలో వేసుకుంది. ఇంట్లో నిధులు ఉన్నాయని, అవి తీయకపోతే ప్రాణాలు పోతాయని నమ్మించి ఆమె వద్ద నుంచి ఏకంగా రూ. 8.20 లక్షలు కామారెడ్డిలో వసూలు చేశారు. డబ్బు తీసుకున్నాక బాబా ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు ఈ ముఠాను వేటాడగా, దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి.         

Continues below advertisement

భిక్షాటన చేస్తూ అనారోగ్య సమస్యలు ఉన్న ఇళ్ల సమాచారం సేకరించి ట్రాప్                  

ఈ ముఠా స్టైలే వేరు. ముందుగా భిక్షాటన పేరుతో గ్రామాల్లోకి వెళ్లి ఏ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆరా తీస్తారు. గత అక్టోబర్‌లో చిన్న మల్లారెడ్డి గ్రామంలో లాస్య అనే మహిళ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న నర్సింలు, వారింట్లో లంకె బిందెలు ఉన్నాయని నమ్మబలికాడు.  పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతాయి.. లేదంటే మీ ఇంట్లో శవం లేస్తుంది  అని భయపెట్టి వారి వద్ద నుంచి రూ. 2.93 లక్షలు దండుకున్నట్లు విచారణలో తేలింది. ఇలా కేవలం మాటలతోనే ప్రజల గుండెల్లో భయం నింపి లక్షల రూపాయలను వీరు ఆన్లైన్ , నగదు రూపంలో గుంజేవారు.                     

ఎంత మందిని మోసం చేశారో ఆరా తీస్తన్న పోలీసులు                             

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వేములవాడకు చెందిన నర్సింలుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల నగదు, రెండు విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో ఎవరైనా మిమ్మల్ని భయపెడితే నమ్మవద్దని, ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర  ప్రజలను కోరారు.  ప్రస్తుతం ఈ నిందితులను రిమాండ్‌కు తరలించి, వీరు ఇంకెంత మందిని మోసం చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.