Kakinada Girl dies With gun misfires:
- తుని మండలం లోవకొత్తూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజు విషాదం
- నాటు తుపాకీ బుల్లెట్ తగిలి నాలుగేళ్ళ చిన్నారి అక్కడికక్కడే మృతి
- పందిని కాల్చడానికి ప్రయత్నించగా పెను విషాదం
- చిన్నారి మృతికి కారణమైన నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు


కాకినాడ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పందుల్ని కాల్చబోతే బుల్లెట్ పాపకు తగలడంతో తీవ్ర రక్రస్రావమై చనిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న పాప మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
అసలేం జరిగిందంటే..
కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి దగ్గర్లో ఆడుకుంటోంది. అదే ప్రాంతంలో నాటు తుపాకులతో కొందరు వ్యక్తులు పందులను వేటాడుతున్నారు. పందులను కాల్చడానికి నాటు తుపాకీ పేల్చగా.. స్నేహితులతో కలిసి ఆడుకుంటోన్న చిన్నారి ధన్యశ్రీకి తూటా తగిలింది. దాంతో చిన్నారి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది చూసి షాకైన బాలిక స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వారు పరుగు పరుగున అక్కడికి వచ్చి చూసి ఆవేదన చెందారు. నాటు తుపాకీ బుల్లెట్ తాకడంతో తమ కూతురు చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా కాల్చాడా, లేక పొరపాటున తుపాకీ మిస్ ఫైర్ అయిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.



ఇటీవల తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి
గత వారం శ్రీనివాసుడికి చెల్లించుకోవాల్సిన మొక్కును తీర్చుకోవడానికి బయల్దేరింది లక్షిత ఫ్యామిలీ. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం ఏడు కొండ వేంకటేశ్వర స్వామిని చూసేందుకు వచ్చారు. పదిమంది కలిసి వెళ్తున్నందున కాలినడకన కొండకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. అలిపిరిలోని నడక మార్గంలో  రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత వడివడిగా అడుగులు ఆడుతూ పాడుతూ ముందుకెళ్లింది. 

సీసీ కెమెరాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఆనందంగా అందరి కంటే చురుగా మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా రాత్రి 11 గంటల సమయానికి  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకునే సరికి పాప కనిపించలేదు. రాత్రి వేళలో పాప లక్షిత కనిపించకపోయే సరికి తల్లిదండ్రులతోపాటు వారితో వచ్చిన వారిలో కంగారు మొదలైంది. మొత్తం వెతికారు. పిలిచారు అయినా లక్షిత పలకలేదు. ఏం జరిగిందో ఏమో అనుకున్నారు. వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఉదయం చెట్ల పొదల్లో కాలిమార్గంలో డెడ్ బాడీ చూసేవరకు మాత్రం వాళ్లుకు చిరుత దాడి చేసిన సంగతి గమనించలేకపోయారు. ఆపై టీటీడీ అటవీశాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేయగా చిరుత చిక్కింది. మరోవైపు భక్తుల రక్షణ కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నడకమార్గంలో ఆంక్షలు విధించింది.