Pulivendula Firing : కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేగింది. భరత్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయంపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ టవర్ వద్ద భరత్ కుమార్ అనే వ్యక్తి (విలేకరిగా పనిచేస్తున్నాడు) తన లైసెన్సుడు రివాల్వర్ తో ఇద్దరు వ్యక్తులను కాల్చాడన్నారు. భరత్ యాదవ్ మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. భరత్ కుమార్ కాల్చడంతో దిలీప్, భాష అనే వ్యక్తులకు బుల్లెట్లు దిగాయి. దిలీప్ అనే వ్యక్తికి సీరియస్ గా ఉండడంతో కడపకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భరత్ యాదవ్ కు దిలీప్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, దానివల్లే ఈ కాల్పులు జరిగాయని ప్రాథమిక సమాచారం ఉందని ఎస్పీ అన్నారు. ముందుగా దిలీప్, భరత్ యాదవ్ ఇద్దరు గొడవపడ్డారని ఆ తర్వాత భరత యాదవ్ ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న లైసెన్స్ రివాల్వర్ తీసుకొని వచ్చి దిలీప్, బాషపై కాల్పులు జరిపాడని తెలిపారు. భరత్ యాదవ్ గతంలో తనకు ప్రాణహాని ఉందని సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేక ఆధారంగా అతనికి లైసెన్స్ రివాల్వర్ ఇచ్చామని ఎస్పీ అన్బురాజన్ చెప్పారు.
"పులివెందులలో భరత్ అనే వ్యక్తి ఇద్దరిపై కాల్పులు జరిపాడు. తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ గన్ తో కాల్పులకు తెగబడ్డాడు. ఒకరు మృతి చెందాడు, మరొకరికి గాయాలయ్యాయి. ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ కాల్పులు జరిగాయి. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాం. దీనిపై అవాస్తవ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం." - ఎస్పీ అన్బురాజన్
వివేక హత్య కేసులో అనుమానితుడు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. దిలీప్ , మస్తాన్ అనే వ్యక్తులపై భరత్ కుమార్ యాదవ్ కాల్పులు జరిపారు. వీరిద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే దిలీప్ చనిపోయారు. మస్తాన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే వివాదం ఏర్పడినట్లుగా భావిస్తున్నారు. తనకు రావాల్సిన డబ్బుల విషయంలో మాటా మాటా పెరగడంతో భరత్ యాదవ్ ... తన ఇంటికి వెళ్లి ఇంట్లో దాచి ఉంచిన తుపాకీ తీసుకుని వచ్చి కాల్పులు జరిపారు.
వివేకా హత్య కేసులో పలుమార్లు భరత్ యాదవ్‌ను ప్రశ్నించిన సీబీఐ
భరత్ కుమార్ యాదవ్ పేరు వైఎస్ వివేకా హత్య కేసులో కూడా వినిపించింది. ప్రస్తుతం వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ సమీప బంధువే భరత్ కుమార్ యాదవ్. సీబీఐ ఆయనను కూడా వివేకా కేసులో ప్రశ్నించింది. వివేకానందరెడ్డి హత్య ఘటనకు వివాహేతర సంబంధాలు, సెటిల్మెంట్లే కారణమని తరచూ మీడియా మందుకు వచ్చి చెబుతూ ఉంటారు. సీబీఐ పై కూడా భరత్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందని మీడియా సమావేశాల్లో చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనను భరత్ యాదవ్ భయపెడుతున్నారని, ప్రలోభ పెడుతున్నారని సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు.