Kadapa Crime News: మద్యం.. కరోనా కంటే అతి పెద్ద మహమ్మారి. ఒకటీ రెండు సంవత్సరాలు మాత్రమే కరోనా వేధించింది. కానీ మద్యం మహమ్మారి ఏళ్లకు ఏళ్లుగా ప్రజలను వేధిస్తూనే ఉంది. దీని వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు, జీవితాలు రోడ్డుపై పడ్డ వారు కోకొల్లలు. మహమ్మారి మద్యం ఎన్నో కుటుంబాలను, ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. మద్యం మత్తు విపరీత ధోరణులకు కారణం అవుతుంది. తాగొచ్చి ఇంట్లో అలజడి రేపే వ్యక్తులు సమాజంలో చాలానే కనిపిస్తుంటాయి. తాగి వారి ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా.. వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసేస్తున్నారు. తాగడానికి డబ్బులు ఇవ్వాలని పెళ్లాలతో గొడవ.. డబ్బులు ఇచ్చాక తాగొచ్చి గొడవ.. ఘర్షణ పడటం, తాగి రోడ్డుపై పడిపోవడం చాలా జరుగుతుంటాయి. 


తాగొచ్చి వేధింపులు..


ఇంటి పెద్ద తాగుడుకు బానిస అయితే ఆ కుటుంబం ఎలాంటి కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాగుడుకు బానిసలైన భర్తల చేతిలో వేధింపులకు గురయ్యే భార్యల సంఖ్య లెక్కకు మిక్కిలి ఉంటుంది. ఇలాంటి తాగుడుకు బానిసైన భర్తపై ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో ఓ ఇల్లాలు దాడి చేయగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కడప జిల్లాలో జరిగింది. 


ఓపిక నశించి.. 


కడపలోని శ్రీకృష్ణ దేవరాయ కాలనీకి చెందిన సుబ్బ నర్సయ్యకు సుజాతకు 20 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సుబ్బ నర్సయ్య - సుజాత దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సుబ్బ నర్సయ్య స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల నర్సయ్య తాగుడు బానిసగా మారాడు. నిత్యం ఇంటికి తాగొచ్చే వాడు. తాగొచ్చిన వ్యక్తి ఊరికే ఉండకుండా సుజాతను వేధించడం మొదలు పెట్టాడు. సుజాతను పిల్లలను ముందే చిత్రహింసలు పెట్టే వాడు.


భర్త వేధింపులు భరించలేని సుజాత.. పెద్దల సమక్షంలో తనకు న్యాయం చేయాల్సిందిగా తన బాధను వెల్లబోసుకుంది. తాగుడుకు బానిసైన నర్సయ్యను తన తీరు మార్చుకోవాలని, పెళ్లాం పిల్లలను మంచిగా చూసుకోవాలని చెప్పారు పంచాయితీ పెద్దలు.


అయినా నర్సయ్య తీరులో ఇసుమంతైనా మార్పు రాలేదు. రోజూ తాగొచ్చి వేధిస్తుండే వాడు. ఇలా అర్ధరాత్రి సుబ్బ నర్సయ్య మద్యం తాగొచ్చి భార్య సుజాతను వేధించగా.. ఓపిక నశించిన సుజాత రోకలి బండతో అతడి తలపై కొట్టింది. దెబ్బ బలంగా తాకడంతో సుబ్బ నర్సయ్య అక్కడికక్కడే కుప్పకూలాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితురాలు సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. 


ఒంటరైన పిల్లలు..


తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. తల్లిదండ్రులకు దూరమైన ఆ పిల్లల జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. వారు అమ్మా.. నాన్న.. అంటూ వెక్కి వెక్కి ఏడవడం చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి.