జగిత్యాల జిల్లాలో ఓ తండ్రి అత్యంత అమానవీయ రీతిలో తన కన్న కూతుర్లను బావిలో తోసేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లాలోని నర్సింగాపూర్‌లో జలపతి రెడ్డి అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి తాను ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి తండ్రి జలపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం  ఆర్థిక సమస్యలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 


పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన చిన్నారుల్లో మధుమిత అనే బాలిక 5వ తరగతి చదువుతుంటే, ప్రణిత్య అనే బాలిక రెండో తరగతి చదువుతోంది. జలపతి రెడ్డికి చెందిన భూమిని ప్రజా అవసరాల కోసం తీసుకున్న ప్రభుత్వం.. పరిహారాన్ని కోర్టులో డిపాజిట్‌ చేసింది. ఆ డబ్బులు చేతికి రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా తనకున్న కొంత వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన డబ్బులతో అప్పులు కట్టేసి, మిగతా కొంత డబ్బులను ఊళ్లో, జగిత్యాలకు చెందిన కొంతమందికి అప్పుగా ఇచ్చారు. వారెవరూ తిరిగి చెల్లించడం లేదని, ఎగవేశారని తెలుస్తోంది. పిల్లలు ఎదుగుతుండటం, అవసరాలు పెరిగిపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 


ఈ క్రమంలో మానసిక ఇబ్బందులకు గురైన జలపతి రెడ్డి గత నెలలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సూసైడ్‌ నోట్‌ రాసి దగ్గర పెట్టుకున్నాడు. దాన్ని తన భార్యకు కూడా ఫోన్‌లో పంపించినట్లుగా గ్రామస్థులు ఈ విషయాన్ని చెప్పారు. అయితే తాను ఆత్మహత్య చేసుకుంటానని తరచూ చెప్తూ ఉండడంతో కుటుంబసభ్యులు మొదట్లో పట్టించుకున్నా, తర్వాత తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ముగ్గురు కుమార్తెలను తీసుకుని స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఘోరం జరిగింది.


ఆ శుభకార్యానికి పెద్ద కూతురు వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. శనివారం (ఫిబ్రవరి 4) ఉదయం జలపతి రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తొలుత హత్యగా భావించారు. ఆ తర్వాత బావిలో చిన్నారుల మృతదేహాలు కూడా కనిపించాయి. వారిని కూడా బయటకు తీయడంతో కుమార్తెలను బావిలో తోసేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనపై మొదట భార్య అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తర్వాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లాయర్ వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పిల్లలను బావిలో తోశాడని చెప్పింది. ఈ ఫిర్యాదు, మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఫోన్ రికార్డింగులు, ఆయనతో గతంలో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు.