ముంబైలో జగిత్యాల జిల్లా వాసి కిడ్నాప్
దుబాయ్ నుండి తిరిగి వస్తుండగా బంధించారు
రూ.15 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు


Jagityal Man Kindnapped In Mumbai: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామానికి చెందిన ముత్తమల్ల శంకరయ్య గత తొమ్మిది రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉన్నాడు. ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి దుబాయ్ లో పని కోసం వెళ్లిన శంకరయ్య తిరిగి అక్కడ నుండి వస్తూ ముంబై ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉండగా జూన్ 22న ఆయనను కిడ్నాప్ చేశారు. పకడ్బందీగా ప్లాన్ చేసుకుని, నమ్మించి మరీ తమతోపాటు తీసుకెళ్లిన దుండగులు గుర్తు తెలియని ప్రదేశంలో బంధించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా నాలుగు రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు  తెలిసింది. 


కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు
శంకరయ్య కుమారుడైన హరీష్ ముంబై వెళ్లి అక్కడి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. అప్పటినుండి దాదాపుగా మూడు సార్లు ఫోన్ చేసిన కిడ్నాపర్లు 15 లక్షలు ఇస్తేనే శంకరయ్య ఇంటికి చేరుతారంటూ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. అయితే అసలు శంకరయ్య పరిస్థితి ఏరకంగా ఉందో అని భయపడుతున్న కుటుంబ సభ్యులకు గుండెలు పగిలేలా... సాక్ష్యం కోసం కిడ్నాపర్లు ఒక ఫోటో పంపించారు. అందులో శంకరయ్య  తాళ్లతో కాళ్ళూ చేతులు  కట్టేసి దీనమైన పరిస్థితిలో బందీగా ఉంచారు. పరిస్థితి చూస్తుంటే అతన్ని భౌతికంగా హింసించి ఉంటారని కుటుంబ సభ్యులు ఆందోళన  చెందుతున్నారు. 


ఎలా ఫాలో అయ్యారు, అసలేం జరిగిందంటే..
అసలు శంకరయ్య ను ఏ రకంగా వీరు ఫాలో అయ్యారు ? ఏమి చెప్పి ఎక్కడికి తీసుకెళ్లారు ? అనే విషయంపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఇక్కడ ఉపాధి లేకనే దీనమైన పరిస్థితుల్లో దుబాయ్ వెళ్లిన శంకరయ్య అక్కడ కష్టపడి సంపాదించి అప్పులు కట్టడానికి... ఇతర కుటుంబ అవసరాలకు డబ్బు సరిపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాము 15 లక్షలు ఎక్కడినుండి తేవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కిడ్నాపర్లు తన భర్తను ప్రాణాలతో విడిచి పెట్టాలని కిడ్నాపర్లను శంకరయ్య భార్య కోరారు. మరో వైపు ఇంటికి తిరిగి వచ్చేలా చేయాలని మంత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ఇప్పటికే కలిసి విన్నవించారు. ప్రభుత్వం తన భర్తను కిడ్నాపర్ల చెరనుంచి విడిపించి క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని శంకరయ్య భార్య అంజవ్వ కుమారుడు హరీష్ కూతురు గౌతమి వేడుకుంటున్నారు.