Degree Student Suicide Case: మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంచలనం రేపిన డిగ్రీ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. స్నేహితురాలు అందరి ముందు చెంపదెబ్బ కొట్టడంతో అవమానంగా భావించి యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగింది. ఈ ఆత్మహత్య కేసుపై పెద్ద ఎత్తున ఆందోళన జరగడంతో కేసును తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ నుంచి జడ్చర్ల పీఎస్ కు బదిలీ చేశారు. 


మహబూబ్‌నగర్‌ డీఎస్పీ టి.మహేశ్‌ వివరాలిలా ఉన్నాయి. తిమ్మాజిపేట మండలంలోని ఓ తండాకు చెందిన 19 ఏళ్ల గిరిజన విద్యార్థిని  జడ్చర్ల బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీజెడ్‌సీ చదువుతోంది. మేకల శ్రీనివాసరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ లోని బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా గంగవరం మండలం కావురివారిపేట గ్రామం. 2011లో లెక్చరర్ జాబ్ వచ్చింది.  నాలుగేళ్ల కిందట 2018 నుంచి బీబీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదివే విద్యార్థినితో చనువుగా మెలిగి ఆమెను లొంగదీసుకున్నాడని సమాచారం. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ కొంతకాలం తరువాత విద్యార్థినిని పట్టించుకోవడం మానేశాడు. తనను ఎందుకు దూరం పెడుతున్నాడో అర్థం కాక విద్యార్థిని ఒత్తిడికి లోనైంది. 


కాలేజీలో గొడవ, సోషల్ మీడియాలో వీడియో వైరల్
అదే సమయంలో కాలేజీలో కొందరు విద్యార్థినుల మధ్య అక్టోబర్ 18న గొడవ జరిగింది. మూసాపేట మండలం నిజాలాపూర్‌కు చెందిన విద్యార్థిని ఆమెను చెంప దెబ్బ కొట్టింది. అందరూ చూస్తుండగా స్నేహితురాలు తన చెంపపై కొట్టడం, మరోవైపు లెక్చరర్ తనను దూరం పెట్టడం ఆమెను మరింత బాధించాయి. స్నేహితురాలు తనను కొట్టినప్పుడు తోటి విద్యార్థులు వీడియోలు తీయగా, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవమానం భరించలేక బాధిత విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 


తండాకు చెందిన విద్యార్థిని అక్టోబర్ 19న పురుగుల మందు తాగింది. మహబూబ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ బిడ్డ చావుకు కారణం మరో ఇద్దరు స్నేహితురాళ్ళు కళాశాల యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అంటూ నిరసన తెలిపారు. కళాశాల ముందు విద్యార్థిని  బంధువులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బంధువులు కళాశాలలోకి చొచ్చు కొని వెళ్లి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ఈ ఘటనపై తిమ్మాజీపేట పీఎస్ లో కేసు నమోదైంది. 
కాలేజీలో గొడవ జరిగి యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో 22వ తేదీన తిమ్మాజిపేట పీఎస్ నుంచి జడ్చర్ల పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు, ఎస్‌ఐలు విద్యార్థిని ఆత్మహత్య కేసుపై విచారణ జరిపారు. ఆ కాలేజీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును మొదటి నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అతడిపై అత్యాచారంతో పాటు ఆత్మహత్యకు కారణమయ్యాడన్న అభియోగాలతో కేసులు నమోదు చేశారు పోలీసులు. బాధిత విద్యార్థినిని చెంపపై కొట్టిన తోటి విద్యార్థినిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసుతో పాటు అత్మహత్యకు కారణమైందని ఆమెపై సైతం మరో కేసు నమోదు చేశారు. జడ్చర్ల పోలీసులు మంగళవారం నాడు శ్రీనివాసరావును, స్వగ్రామంలోని ఇంట్లో విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు సాయంత్రం జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ కు ఆదేశించారు.