ఏపీ ఇంటర్​ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం విడుదలయ్యాయి. అయితే మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్​ అయ్యాననో ఆత్మన్యూనత భావన, మనస్తాపంతో విద్యార్థులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. 

విశాఖ జిల్లా తగరపువలస గ్రామం కొండపేటకు చెందిన జి.చరణ్ సూసైడ్​ చేసుకున్నాడు. ఇంటర్​లో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. మార్కులు చూసుకున్న చరణ్​ పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. ఏం బాధపడవద్దని, మళ్లీ పరీక్షలు రాయెుచ్చని ధైర్యం చెప్పారు. అప్పటికే తీవ్రంగా కుంగిపోయిన చరణ్​.. తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లగా ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు. 

గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న చరణ్‌ను హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అతడు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచిన కొడుకు తిరిగిరాడని తెలిసి కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఫెయిల్​ అవుతాననే భయంతో ముందుగానే..ఫలితాలు విడుదల కాకముందే ఫెయిల్​ అవుతాననే భయంతో ఓ స్టూడెంట్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏ.కోడూరు గ్రామానికి చెందిన వెంకట సుదీశ్వరరెడ్డి నంద్యాలలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు సరిగా రాయకపోవడంతో కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. శనివారం రిజల్స్ విడుదలవుతాయని తెలిసి భయపడిపోయాడు. ఫెయిల్ అయ్యానని తెలిస్తే అందరూ తనను అవమానిస్తారని కుంగిపోయి శుక్రవారం తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి సైతం కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్​లో ఫెయిలయ్యానని తెలుసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ బాలిక రెండు సబ్జెక్టుల్లో ఫెయిలవడంతో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని ప్రతిబింబిస్తున్నాయి.