Hyderabad Young Man Died Due To Gun Misfired In America: హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ యువకుడు తన సొంత తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి మృతి చెందిన ఘటన అమెరికాలో (America) చోటు చేసుకుంది. ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌లోని (Uppal) ధర్మపురికాలనీలో నివసించే పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత దంపతుల ఏకైక కుమారుడు ఆర్యన్ రెడ్డి (23) గతేడాది డిసెంబరులో ఉన్నత చదువులకు అమెరికా వెళ్లాడు. జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కెన్నెసా స్టేట్ యూనివర్శిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదువుతున్నాడు.
ఈ నెల 13న స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నాడు. అదే రోజు ఆర్యన్ ఉండే గది నుంచి తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. ఆందోళనతో స్నేహితులు వెళ్లి చూసేసరికే అతను విగతజీవిగా పడి ఉన్నాడు. తూటా ఛాతీ లోపలికి దూసుకుపోవడంతో అక్కడికక్కడే ఆర్యన్ మృతి చెందాడు. పుట్టినరోజు వేడుకలో భాగంగా కొత్తగా కొనుగోలు చేసిన తుపాకీని బయటకు తీసి శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ నొక్కుకుపోయి ఈ దుర్ఘటన జరిగినట్లు స్నేహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. భువనగిరి జిల్లాలోని పెద్దరావుపల్లి గ్రామానికి చెందిన ఆర్యన్ కుటుంబం ప్రస్తుతం ఉప్పల్‌లో నివసిస్తోంది. తమ కుమారుడి మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
'గన్ కల్చర్ వల్లే..'
అమెరికాలో గన్ కల్చరే తమ కుమారుడిని పొట్టన పెట్టుకుందని ఆర్యన్ తండ్రి సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ విద్యార్థులకు కూడా గన్ లైసెన్స్ ఇస్తారని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. దేశ సేవ అంటే ఆర్యన్ చాలా ఆసక్తి చూపేవాడని.. ఆర్మీలో చేరతానంటే తానే వద్దని వారించినట్లు చెప్పారు. కాగా, ఆర్యన్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టులోనే హంటింగ్ గన్‌కు లైసెన్స్ తీసుకున్నారు. ఇందుకోసం ఓ పరీక్ష కూడా రాసినట్లు తెలుస్తోంది.