TSPSC Paper Leak SIT : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ రోజుకో మలుపుతిరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అటు రాజకీయనాయకులతో పాటు లీకేజీకి పాల్పడిన వారిని విచారిస్తుంది. సిట్ దర్యాప్తులో సంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన ఉద్యోగులపై జాబితాను తీసిన సిట్... వారి మార్కులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్పీ ఉద్యోగుల్లో మరో ఇద్దరికి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అత్యధిక మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగం సాధించిన షమీమ్‌కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 127 మార్కులు, టీఎస్పీఎస్సీలో పొరుగుసేవల ఉద్యోగిగా పనిచేస్తున్న రమేశ్‌కు 122 మార్కులు వచ్చినట్లు సిట్‌ అధికారుల దర్యాప్తులో తేలింది. పేపర్ల లీకేజీ కేసులో A2 నిందితుడు రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్ పొందినట్లు షమీమ్‌ ఒప్పుకున్నాడు. అందుకు తాను డబ్బులు చెల్లించలేదని తెలిపాడు.  


ఫోన్ డేటా ఆధారంగా 


పేపర్ల లీకేజీలో మరో కోణం వెలుగు చూస్తుంది. నిందితుల సెల్ ఫోన్లలోని డేటా, వాట్సప్‌ చాట్, గ్రూపుల ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ సమాచారంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తయారుచేసేందుకు సిట్ ప్రణాళిక సిద్ధం చేసింది. టీఎస్పీఎస్సీలో పలు విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులు... గత అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు ఉద్యోగులు 100కు పైగా మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం సేకరణలో పడింది సిట్‌ బృందం. 


ముగ్గురికి 14 రోజుల రిమాండ్ 


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఆ ముగ్గురికి నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించింది.  లీకేజీ కేసులో రమేశ్‌, సురేశ్‌, షమీమ్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 2013లో గ్రూప్‌-2 ఉద్యోగం పొందిన షమీమ్‌ తాజాగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 127 మార్కులు పొందాడు. టీఎస్పీఎస్సీలో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేస్తున్న రమేశ్‌ 122 మార్కులు సాధించాడు. వీరు నిందితుడు రాజశేఖర్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ పొందినట్లు సిట్ గుర్తించింది. నిందితులను సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ ఆదేశాలతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.


నార్మలైజేషన్ విధానం 


రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతుంది. ఇకపై ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాతపరీక్షలను వేగంగా నిర్వహించి, వెంటనే ఫలితాలు వెల్లడించే దిశగా.. ఆన్‌లైన్ విధానంవైపు అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నలనిధి రూపొందించి, అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. అంతకు మించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు ఈ విధానాన్ని విస్తరించనుంది. అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి, నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని కమిషన్ భావిస్తోంది.