ఓ తల్లి సవతి కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. తనకు అడ్డుగా ఉన్నాడనే కోపంతో కుమారుడిని తల్లి రెండు వారాల క్రితం మేడ పైనుంచి నెట్టేసింది. అయినా అదృష్టవశాత్తు అతను బతికాడు. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకొని, తిరిగి ఇంటికి వచ్చిన కుమారుడిని ఆ సవతి తల్లి గొంతు నులిమి చంపేసింది. హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది.


కాచిగూడ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోల్నాకలో ఉంటున్న భాస్కర్‌, సరిత దంపతులు ఉంటున్నారు. వీరిలో భాస్కర్ ప్రైవేటు ఉద్యోగి. అతని కుమారుడు ఏడేళ్ల ఉజ్వల్‌ రెండు వారాల క్రితం ఓ భవంతి పై నుంచి కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్రమైన గాయాలు కాగా, అతణ్ని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం రెండు రోజుల క్రితమే బాలుడ్ని ఇంటికి తీసుకొని వచ్చారు. ఇలా ఉండగా సరిత (బాలుడి సవతి తల్లి) శనివారం భర్తకు ఫోన్‌ చేసి ఉజ్వల్‌ కదలకుండా పడి ఉన్నాడని చెప్పింది.


కంగారు పడిపోయి వెంటనే ఇంటికి చేరుకున్న భాస్కర్‌ తన కొడుకుని పరిశీలించాడు. అతని గొంతు పిసికినట్లుగా ఎర్రటి గుర్తులు కనిపించాయి. అనుమానం వచ్చిన అతను కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు బాలుడి వద్దకు వచ్చి శవాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. పోస్టు మార్టంలో బాలుడిని గొంతు నులిమి చంపినట్లుగానే నివేదికలో తేలింది.


కొడుకు ఆలనాపాలన చూస్తుందని సరితను రెండో పెళ్లి చేసుకున్నానని, ఆమె ఇంత దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేదని భాస్కర్ వాపోయాడు. కొడుకు మృతదేహం వద్ద అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఉజ్వల్ ను చంపిన సవతితల్లి సరితను కఠినంగా శిక్షించాలని పోలీసులను స్థానికులు కూడా కోరుతున్నారు.