Hyderabad Crime News: సెల్ ఫోన్ చార్జర్ కోసం గొడవ పడి ఓ వ్యక్తి ఓ మహిళ నిండు ప్రాణం తీశాడు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దుండిగల్ స్టేషన్ పరిధి తండా 2లో పాలు, కల్లు, మద్యం విక్రయిస్తూ శాంత అనే 50 ఏళ్ల మధ్య వయస్కురాలు బెల్ట్ షాపు నిర్వహిస్తుంది. అయితే, తన దుకాణం పక్కన ఈమె విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని శాంతిని ఎవరో హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. క్లూస్ టీం ను పిలిపించి ఆధారాలను కూడా సేకరించారు. ఆమేరకు దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ పుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్ అనే 37 ఏళ్ల వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. ఇతను తాండ 2 గ్రామ సమీపంలో గల ఆల్ట్రా క్లీన్ సర్వీసెస్ కంపెనీలో మెయింటెనెన్స్ అండ్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నట్లుగా గుర్తించారు.
అతను అక్కడ అందుబాటులో లేకపోవడంతో గాగిల్లాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మృతురాలితో మొబైల్ చార్జర్ కోసం గొడవపడ్డాడు. మృతురాలు శాంత అసభ్య పదజాలంతో దుర్బాషలాడడంతో నిందితుడు కొట్టి ఆమెను తోసేశాడు. దీంతో ఆమె కిందపడి తల వెనక భాగంలో గాయం అయింది. ఆమె పెద్దగా శబ్దం చేస్తుండడంతో భయంతో నోరు ముక్కు మూసేశాడు. ఫలితంగా బాధితురాలు ఆమె ఊపిరి ఆడక మరణించిందని అంగీకరించడంతో నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.