యువతులు తమ ప్రేమను ఒప్పుకోవడం లేదనే అక్కసుతో పలువురు యువకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే ఏకంగా దారుణ ఆకృత్యాలకు సైతం వెనకాడడం లేదు. నల్గొండ జిల్లాలో ఓ యువకుడు యువతి గొంతు కోసిన ఘటన ఇలా జరిగిందే. తాజాగా ఇలాంటి తరహాలోనే మరో వేధింపు, బెదిరింపు ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది.


ప్రస్తుతం కరోనా కారణంగా చాలా పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలు ఆన్‌ లైన్ ద్వారా విద్యా బోధన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ కాలేజీ కూడా జూమ్ వేదికగా ఆన్‌ లైన్‌లోనే క్లాసులు నిర్వహిస్తోంది. ఇలాగే రోజువారీ ఆన్ లైన్ క్లాసులు జరుగుతుండగా అంతా ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది. అనంతరం అంతా విస్తుపోయారు. విద్యార్థులతో జరుగుతున్న ఆన్ లైన్ క్లాసులో ఓ ఆగంతుకుడు జాయిన్ అయ్యి ఏకంగా ఓ విద్యార్థిని పేరు చెప్పి ఆమెను రేప్ చేస్తానంటూ బెదిరించాడు. అంతేకాక, ఆ లెక్చరర్ పరమ వరస్ట్ అంటూ వ్యాఖ్యానించాడు. ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో లెక్చరర్ సహా అంతా భయపడిపోయారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ పరిధిలోని నాచారం ప్రాంతంలోని ఓ కళాశాల.. తమ విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా జూమ్‌లో క్లాసులు నిర్వహిస్తోంది. ఈ మేరకు జూమ్ క్లాస్‌లకు సంబంధించిన పాస్ వర్డ్‌ను కళాశాల యాజమాన్యం విద్యార్థులకు వాట్సప్ ద్వారా షేర్ చేసింది. ఆన్ లైన్ క్లాస్‌లు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆన్ లైన్‌లోని ప్రవేశించాడు. ఓ విద్యార్థిని పేరును చెప్పి.. ఆమెను రేప్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతోపాటు ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు కూడా పంపాడు. ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి తెలియడంతో మరుసటి రోజు క్లాసులు జరిగే జూమ్ మీట్ పాస్ వర్డ్‌ను మార్చేసింది. 


అయినా ఆగంతకుడు ఆగలేదు. ఆ పాస్ వర్డ్ తెలుసుకొని మరీ వారి ఆన్ లైన్ క్లాసుల్లోకి చొరబడి అసభ్యంగా ప్రవర్తించాడు. కళాశాల లెక్చరర్ జీ మెయిల్‌ను హ్యాక్ చేసి దాని ద్వారా పలువురికి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఫలానా టీచర్ వరస్ట్ అంటూ కామెంట్లు పెట్టాడు. దీంతో విసిగిపోయిన యాజమాన్యం రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు ఆగంతకుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. అయితే, అతను క్లాసులోని విద్యార్థే అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ అంగీకరించకపోవడం వల్లే ఆగంతుకుడు ఇలా అందరి ముందు బెదిరించి ఉంటాడని అనుమానిస్తున్నారు.