హైదరాబాద్ కూకట్ పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు ఆకుల శ్యామ్, పోతుల జ్యోతిగా గుర్తించారు. కేపీహెచ్‌బీ కాలనీలోని 7th ఫేజ్ ఎల్ఐజీ 8లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గొల్లవాని తిప్ప గ్రామానికి చెందిన జ్యోతికి ఇటీవల వివాహం జరిగి విడాకులు తీసుకోవడం జరిగింది. ఈమె తన స్నేహితుడు శ్యామ్ తో కలిసి శనివారం హౌసింగ్ బోర్డ్ కాలనీకి వచ్చారు.
శ్యామ్‌కు కృష్ణ అనే స్నేహితుడు ఉన్నాడు. శ్యామ్ పెళ్లికి కృష్ణ కూడా వెళ్ళగా, ఆ చనువుతో వీరిద్దరూ (శ్యామ్, జ్యోతి) కృష్ణ రూంలో ఉన్నారు. కాగా ఈ రోజు ఉదయం జ్యోతి తమ్ముడు ఇక్కడ రూమ్ కి వచ్చి కిటికీలో నుంచి చూడగా శ్యామ్ ఫ్యాన్ కు వేలాడుతూ వారు కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డోర్లు పగలగొట్టి చూడగా శ్యామ్, జ్యోతి ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జ్యోతి విషం సేవించి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే దానికి గల కారణాలు తెలియాల్సి ఉందని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ సీఐ కిషన్ కుమార్ తెలిపారు.