హైదరాబాద్‌లో బహిరంగంగా ఓ యువకుడు దారుణమైన రీతిలో హత్యకు గురయ్యాడు. మెహెదీపట్నం సమీపంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని కొంత మంది చంపేశారు. స్థానికంగా ఉన్న మోతీ దర్వాజా, జీఎంకే ఫంక్షన్ హాల్ ఎదురుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని నరికి మరీ చంపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని ఉప్పల్‌కు చెందిన కలీమ్ అనే 25 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
అయితే, కలీమ్‌ను హత్య చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతుండగానే.. ఇంతలో హత్య చేసింది తామే అంటూ ముగ్గురు వ్యక్తులు గోల్కొండ పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రెండు రోజుల క్రితం మరో హత్య
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మరో హత్య జరిగింది. చిన్న గొడవ కారణంగా స్నేహితుడిని హత్య చేశారు. ఈ ఘటనలో మహంకాళీ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గత బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్త్‌జోన్ కార్యాలయంలో డీసీపీ చందనదీప్తి, ఏసీపీ రమేష్, సీఐ కావేటి శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ ఓల్డ్ గ్యాస్ మండీకి చెందిన బుక్యా శివాజీ ఈనెల 8న ఉదయం ఓ బాలుడితో కలిసి అదే ప్రాంతంలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. లాలాగూడకు చెందిన గౌస్ పాషాకు ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పటికే శివాజీ మద్యం మత్తులో స్నేహితుడి ఫోన్‌లో పెద్దగా మాట్లాడుతున్నాడు. గౌస్ పాషా వచ్చి ఫోన్‌లో గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావని అడగడంతో అతడిపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే నేరానికి దారి తీసింది.
గౌస్ పక్కనే ఉన్న వైన్‌షాపునకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి తాగి శివాజీ వద్దకు వచ్చాడు. అప్పటికీ శివాజీ కొపంగా ఉండడం, ఆపై ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో శివాజీ గౌస్‌పాషాపై చేయి చేసుకున్నాడు. గౌస్‌పాషా ట్యాంక్‌బండ్ వద్ద ఉంటున్న మహ్మద్ నయూం, మహ్మద్ జకీర్‌లకు ఫోన్ చేసి ఘటన స్థలానికి పిలిపించాడు. గొడవ గురించి తన ఇద్దరు స్నేహితులతో చెప్పాడు. వారు వెళ్లి శివాజీతో గొడవకు దిగారు. వారి మధ్య మాటామాటా పెరగడంతో పాషా జేబులో ఉన్న డెకరేషన్‌కు ఉపయోగించే కత్తితో శివాజీ గొంతు కోశాడు. అతడు అక్కడికక్కడే కింద పడిపోయాడు. భయంతో శివాజీ పక్కనే ఉన్న బాలుడు, పాషా, నయూం, మహ్మద్ జకీర్‌లు అక్కడి నుంచి పారిపోయారు.
ఉదయం 9 గంటల వరకూ శివాజీ రక్తపు మడుగులోనే ఉండిపోయాడు. దాదాపు రెండు గంటల తరువాత సమాచారం అందుకున్న మహంకాళీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శివాజీ మృతి చెంది రక్తపు మడుగులోనే ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. బాధితుడు, మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.