Cyber Crime In Hyderabad: స్టాక్ మార్కెట్లో కొత్తగా చేరిన వాళ్లకు, చేరాలనే ఆలోచన చేస్తున్న వాళ్లకు ఇదో హెచ్చరిక. ఈ పేరుతోనే సైబర్ నేరగాళ్లు ఓ వైద్యుణ్ని బురిడీ కొట్టించారు. స్టాక్ మార్కెట్ పేరుతో నట్టేట ముంచారు. క్వాలిఫైడ్ వైద్యుడైనా సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నా అన్నీ తెలిసిన అతన్నే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. నేరస్తులు పన్నిన వలలో చిక్కుకుని దాదాపు ఎనిమిదిన్నల లక్షల మేర మోసపోయాడా వైద్యుడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.   


హైదరాబాద్ కేపీహెచ్‌బీలో సొంత ఈఎన్‌టీ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఓ వైద్యుడికి ఫేస్ బుక్ చూస్తుండగా ఓ యాడ్ కనిపించింది. ట్రేడింగ్ కు సంబంధించిన సదరు యాడ్ చూసిన ఆ వైద్యుడు దానిపై ఆసక్తి కలిగింది. వివరాల కోసం దాన్ని క్లిక్ చేశాడు. ఓ అప్లికేషన్ వచ్చింది. మొత్తం అడిగిన వివరాలన్నీ ఇచ్చి ఫామ్‌ ఫిల్ చేశాడు. ఆ తరువాత నలుగురు వ్యక్తులు ఫోన్ లో  టచ్ లోకి వచ్చారు.


తమది జేపీ మోర్గన్ చేజ్ సెక్యూరిటీస్ సంస్థ అని ఒకరు చెప్పగా.. తమది గోల్డ్‌మన్ సాచ్స్ కంపెనీ అని మరొకరు, మాన్ గ్రూప్ అని ఇంకొకరు, ది యూఎస్బీ సెక్యూరిటీస్ కంపెనీ అపి నాలుగో వ్యక్తి పరిచయం చేసుకున్నారు. తామంతా  స్టాక్ మార్కెట్ లో డబ్బును ఇన్ వెస్టు చేసి రిస్క్ లేకుండా రిటర్న్స్ ఇస్తామని నమ్మబలికారు. తమను తాము సదరు కంపెనీల నుంచి సబ్ బ్రోకర్లుగా చెప్పుకున్నారు. తమ తమ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టి గతలో ఏ మేరకు ఆర్జించారో చూపించేలా.. నకిలీ సాక్ష్యాలు సిద్ధం చేసుకుని అతనికి చూపించారు. చాలా గొప్ప లాభాలొస్తాయని మాయలో పడేశారు. సొంత యాప్ లు రూపొందించుకుని వాటి ద్వారా వారు ట్రేడింగ్ చేసి లక్షలు గడిస్తున్నట్లు ఆశ చూపించారు. 


ఇలాంటి స్టాక్ బ్రోకింగ్ చేసేటప్పుడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వంటి రెగ్యులేటరీ బాడీస్ నుంచి  తప్పక ఉండాల్సిన టాక్సేషన్ డాక్యుమెంట్ల గురించి వైద్యుడు అడగ్గా.. ‘‘ మీరేం టెన్షన్ తీసుకోకండి.. మా దగ్గర అన్నీ ఉన్నాయ్ మేము సదరు సంస్థల ఉద్యోగులం కాబట్టీ మా వివరాలు బయటపెట్టకూడదు ’’ అంటూ  మభ్యపెట్టారు.


 వైద్యుడికి లింకులు పంపించి కొన్ని యాప్ లు డౌన్లోడ్ చేసుకోమని సూచించారు. వాళ్లు చెప్పినట్లే యాప్ లు డౌన్లోడ్ చేసుకున్న వైద్యుడు.. వాటిలో తొలుత కొంత మొత్తం పెట్టుబడి పెట్టాడు.  మంచి రిటర్న్స్ వచ్చాయి. సదరు డబ్బును వైద్యుడు విత్ డ్రా చేసుకున్నాడు. నమ్మకం కలిగాక.. ఇన్వెస్టు మెంటు పెంచాడు.


అలా మే నుంచి ఇప్పటి వరకూ దాదాపు ఎనిమిదన్నర లక్షల వరకు ఇన్వెస్టు చేశాడు. రిటర్న్స్ కనిపించడంతో తిరిగి విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఈసారి డబ్బు రాలేదు. ఇదేంటని తనతో ఇన్వెస్టు చేయించిన బ్రోకర్లని అడగ్గా ఆ ఫీజు, ఈ ఫీజు కట్టాలి ముందు కడితేనే డబ్బులు వస్తాయి అని చెప్పారు.


ఇదేదో కిరికిరి అని అతనికి అర్థమైంది. ఈలోపు డబ్బు కట్టాల్సిందేనని సదరు బ్రోకర్లు టార్చర్ చేయడం మొదలు పెట్టారు. పెట్టిన డబ్బు ఇరుక్కోవడమే కాకుండా పై నుంచి వీరి వేధింపులు ఎక్కువ అవ్వడంతో మోసపోయానని తెలుసుకున్న వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.


Also Read: బ్లేడుతో గొంతుకోసుకున్న బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్, ఎమ్మెల్యే వేధింపులే కారణమా!