మీరు ఇతర దేశాల నుండి భారత దేశానికి లేదా మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్తున్నారా? ఆన్‌ లైన్ లో ఎక్కడ టిక్కెట్లు తక్కువకు దొరుకుతాయా? అని చూస్తున్నారా? ఏదో ఒక ఏజెన్సీ ద్వారా 50 శాతం తగ్గింపు ధరలకు, 70 శాతం తగ్గింపు ధరలకు టికెట్స్ దొరుకుతున్నాయని ఆశ పడ్తున్నారా? ఐతే బీ కేర్ ఫుల్!! డబ్బులు ఎవరికీ ఊరికే రావు అన్నట్టు ఇలాంటి ఆఫర్లు ఎవరు ఊరికే ఇవ్వరని గమనించాలి.


ఎంత చదువుకున్నా, ఎదో ఒక సందర్భంలో మనల్ని మభ్యపెట్టి, ఆకర్షిత ఆఫర్లు రూపొందిస్తూ రోజుకో రకం నయా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. నిన్న మొన్న హైదరాబాద్, చుట్టూ పక్కల ప్రాంతాల ప్రజలను బురిడీ కొడుతూ డబ్బులు దండుకున్నారు. అయితే తాజాగా విదేశాల్లో ఉన్న వాళ్లకి ఎర వేస్తున్నారు ఈ మోసగాళ్లు.


విదేశీ ప్రయాణానికి చాలా డబ్బు అవసరం పడుతుంది. అలా ఒక ఫ్యామిలి మొత్తం ఇతర దేశాలకు ప్రయాణం చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. దీన్ని ఆసరాగా తీసుకున్న కేటుగాళ్లు ఏకంగా ఏజెన్సీ ఏర్పాటు చేసి, ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారో, వారు ఆన్ లైన్‌లో టికెట్ ల రేట్లు అన్ని రకాల సైట్లలో వెతుకుతారు. అలా వెతికిన వారి లిస్ట్ తీసి వారికి కాల్స్ చేసి ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటిస్తారు. రూ.రెండు లక్షల టికెట్ మా ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా రూ.30 వేలకే పొందుతారు అని మాయ మాటలు చెప్తారు. తీరా డబ్బు చెల్లించిన తర్వాత మొహం చాటేస్తారు. తిరిగి కాల్ చేసినా ఎత్తరు. అలా ఇలాంటి మోసాల వలలో పడిన కొందరి డబ్బు ఏకంగా రూ.35 లక్షలు.


హైదరాద్ కి చెందిన ఓ వ్యక్తి ఈ నెలలో విదేశీ ప్రయాణం కోసం ఆన్‌ లైన్ లో టిక్కెట్లు సెర్చ్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఫలానా ఏజెన్సీ నుండి కాల్ చేస్తునట్టు వరుసగా కాల్స్ రావడంతో కాల్ స్వీకరించిన అతనికి దిమ్మ తిరిగే ఆఫర్ తో ఆకర్షించారు.. సైబర్ నేరగాళ్లు. రూ.రెండు లక్షల ఒక టికెట్ కి కేవలం 30 వేలు చెల్లిస్తే చాలు. 70 శాతం ఆఫర్ ఇస్తున్నట్టు వలలో వేశారు. ఎలాగో కుటుంబంతో వెళ్లేదే కదా అని 10 మందికి టికెట్ కోసం ఒకేసారి డబ్బు చెల్లించాడు బాధితుడు. దాదాపు రూ.లక్షలు ఒకేసారి పంపాడు. కన్ఫర్మేషన్ కోసం టికెట్ బుక్ అయినట్టు స్క్రీన్ షాట్ కూడా చూపించారు. అదే డౌన్ లోడ్ చేసుకున్న అతను ఎయిర్ పోర్టుకి వెళ్ళాక మోసపోయినట్టు తెలుసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు ఇచ్చాడు.


ఏదైనా ఒక వస్తువు, లేదా ఇంకేదైనా అతి తక్కువ ధరకు వస్తున్నాయి అంటే అందులో ఏదో మతలబు ఉన్నట్టు ఆలోచించాలి. లేదా అది నిజంగా ఉందో లేదో అని ధ్రువీకరించుకున్న తర్వాతే ముందుకెళ్లాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇటువంటి తక్కువ ధరకు ఆఫర్లు ఎవరు ఊరికే ఇవ్వరు. అలా ఇస్తున్నారు అంటే మన ఆశని ఆసరాగా తీసుకుని ఇలా మోసం చేశారని గ్రహించాలని ఏసీపీ ప్రసాద్ తెలిపారు.