Cyber Crime : గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసి పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని సైబర్ కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ కు చెందిన సంజయ్ కు ఫోన్ వచ్చింది. సర్ మేం పలానా సంస్థ నుంచి మాట్లాడుతున్నామని ఓ యువతి పరిచయం చేసుకుంది. మా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా తీసిన లక్కీడిప్ లో మీ నెంబర్ సెలెక్టు అయిందని నమ్మించింది. లక్కీ డిప్ లో ఖరీదైన కారు గెలుచుకున్నారని ఊదరగొట్టింది. మీరు కుటుంబంతో సహా పలానా హోటల్  వస్తే గిఫ్ట్ అందజేస్తామని ఫోన్ చేసింది. సంజయ్ వ్యక్తిగత వివరాలన్ని టకటకా చెప్పింది యువతి. కానీ ఈ వివరాలన్నీ మీకెలా తెలుసు అని సంజయ్ ఆలోచించాడు. ఫోన్లో మాట్లాడిన యువతి మాటలకు ఫిదా అయిన సంజయ్ ఆమె చెప్పే విషయాలన్ని శ్రద్ధగా విన్నాడు. కారును ఎప్పుడు ఎలా పంపిస్తారు అని కుతుహులంగా అడిగాడు సంజయ్. దీంతో మరిన్ని వివరాలు తర్వాత చెప్తామని ఫోన్ పెట్టేసిందా యువతి. కొద్దిసేపటి తర్వాత మరో యువతి ఫోన్ చేసి, అదే విషయాన్ని చెప్పి మీకు కారు డెలివరీ ఇవ్వాలంటే, ప్రాసెసింగ్, టాక్స్ ఫీజులు కలిపి రూ. 2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీరు బ్యాంకు ఖాతాలో డబ్బులు చెల్లిస్తే మూడు రోజుల్లో మీకు రూ. 10 లక్షల విలువైన కారు డెలివరీ చేస్తామని చెప్పింది. కారు మీ చేతికి అందిన వెంటనే మీరు చెల్లించిన ఫీజు తిరిగి ఇచ్చేస్తారని పలికింది. యువతి చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు జమ చేశాడు బాధితుడు. ఆ తర్వాత ఫోన్ చేసి మరో రూ. లక్ష చెల్లించాలని చెప్పడంతో అది కూడా చెల్లించాడు. ఆ తర్వాత యువతి నుంచి ఫోన్ రాలేదు. దీంతో సంజయ్ తిరిగి ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్య ఒక్క సంజయ్  ది మాత్రమే కాదు నిత్యం వందలాది మంది ఇలానే మోసపోతున్నారని పోలీసులు అంటున్నారు.  


  డేటా ఫర్ సేల్ 


ఒక ప్రైవేటు డాటాబేస్ సంస్థ నుంచి షేర్ హోల్డర్స్ వివరాలు కొనుగోలు చేసిన సైబర్ కేటుగాళ్లు ఫోరెక్స్ ట్రేడింగ్ పేరుతో షేర్ హోల్డర్స్ కు ఫోన్ చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి వారిని ముగ్గులోకి దింపి దాదాపు రూ. 5 కోట్లకు పైగా కొల్లగొట్టారు రాజస్థాన్, ముంబయికి చెందిన ముఠాలు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులకు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి వివరాలు సేకరించి వాటిని అమ్మేసే డాటా బేస్ సంస్థలు చాలా ఉన్నట్లు సైబర్ కేటుగాళ్లు పోలీసులకు వివరించారు. ఉద్యోగాలిస్తామని, ఆన్లైన్లో రెజ్యూమ్ వివరాలు అప్లోడ్ చేయాలని నిరుద్యోగుల నుంచి బయోడేటా వివరాలు సేకరిస్తున్న కొన్ని కన్సల్టెనీలు నిరుద్యోగుల సమాచారాన్ని అమ్మేస్తున్నారు. దాన్ని కొనుగోలు చేసిన సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులకు ఫోన్ చేసి, పలానా సంస్థలో ఉన్నతోద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నమ్మించి మోసం చేస్తున్నారు. ఆన్లైన్లో నకిలీ నియామక పత్రాలు పంపడంతో పాటు వివిధ రకాల ఫీజుల పేరుతో వారి వద్ద నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. కొన్ని జాబ్ కన్సల్టెన్సీ సంస్థలు సైతం ముఠాలుగా ఏర్పడి ఇలాంటి దందా కొనసాగిస్తున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. 


డేటా చోరీ కేసులు 


 డేటా చోరీ కేసులు ఈ మధ్య చాలా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. అలాగే రాబోయే రోజులో ఈ కేసులు మరింత పెరిగి సమస్యాత్మకంగా మారుతుందన్నారు. ఆధార్ కార్డు నుంచి, ఓటరు కార్డు వరకు.. ఫోన్ నెంబర్ నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వరకు రెజ్యూమ్ నుంచి షేర్ మార్కెట్ వరకు ప్రతి వ్యక్తిగత సమాచారం అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారన్నారు. అలాంటి ప్రైవేట్ ఏజెన్సీలు కొన్ని అందుబాటులోకి రావడంతో వారి వద్ద నుంచి కావాల్సిన సమాచారాన్ని సైబర్ కేటుగాళ్లు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఒక్కసారి ఇంక్రిప్ట్ అయిన తరువాత దేక్రప్టు చేయడానికీ సాధ్యం కాదు. దాన్ని అడ్డంపెట్టుకొని అవకాశాన్ని బట్టి రకరకాల స్కీములతో భారీ స్కాములకు తెరతీస్తున్నారని పోలీసులు తెలిపారు.   కొన్ని ప్రేవేట్ ఏజెన్సీలు వివిధ రకాల మార్గాల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, డేటా బ్యాంకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు కేటుగాళ్లు అక్రమార్కులకు అమ్ముకుంటున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు.  బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆన్లైన్ చెల్లింపులు చేసే కొన్ని ఏజెన్సీలు వారి వద్దకు వచ్చే కస్టమర్ల నుంచి ఫోన్ నెంబర్లు, ఇతర డాక్యుమెంట్స్ ను ఒక కాపీని సేకరిస్తున్నారు. అలా సేకరించిన సమాచారాన్ని బల్క్ గా ఇంత ధర అని నిర్ణయించి కావాల్సిన వారికి  అమ్మేస్తుంటారు. ఇలా ఒకే సమాచారాన్ని అనేక మందికి అమ్ముతున్నారు.


 జాగ్రత్తలు 


ప్రతి సోషల్ మీడియాలో డేటాని సెక్యూర్ చేయడానికి step two verification ఉంటుంది. మన అకౌంట్ కి  ఎంత సేఫ్టీ వాల్స్ యాడ్ చేస్తే అంత సెక్యూర్ గా అకౌంట్ ఉంటుంది. కాబట్టి బ్యాంక్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ ఇతర సామాజిక ప్లేట్ఫామ్స్ లో step two verifications ని enable చేస్కోడం ద్వారా సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చు. 


డేటా చోరీ ఎలా? 
 
కొత్తగా సిమ్ కార్డు కొనుగోలు చేస్తున్న కస్టమర్ల నుంచి టెలీకాం సంస్థల ఎగ్జిక్యూటివ్లు సేకరించిన పూర్తి సమాచారాన్ని, చిరునామాలను, కస్టమర్లు తీసుకున్న కొత్త ఫోన్ నెంబర్లను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కొనుగోలు చేస్తున్నాయి. అడ్డదారిలో కమీషన్ రూపంలో అధిక సంపాదనకు అలవాటుపడిన వారు వారి వద్ద ఉన్న సమాచారాన్ని అమ్ముతున్నారు. దాని వల్ల తనకు వచ్చే నష్టమేమీ లేకపోవడంతో ఇలాంటి అక్రమ దందాలకు తెరతీస్తున్నారు.  కొందరు జీరాక్స్ సెంటర్ నిర్వాహకులు సైతం ఇలాంటి సంపాదనకు అలవాటు పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. తమ వద్దకు జీరాక్స్  కోసం వచ్చే కస్టమర్ల వద్ద నుంచి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుల జీరాక్స్ లను ఒక్కో కాపీని కస్టమర్ కు తెలియకుండా భద్రపరిచి వారి వద్దకు వచ్చే ప్రైవేట్ ఏజెన్సీల వారికి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తక్కువ మొత్తానికి కొనుగోలు చేస్తున్న కొందరు ప్రైవేటు సంస్థల కేటుగాళ్లు ఆ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు లక్షల రూపాయలకు అముతున్నట్లు అధికారులు గుర్తించారని సైబర్ నిపుణులు చెపుతున్నారు.