Jeevitha Rajashekar : సినీ నటి జీవితా రాజశేఖర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. జియో బహుమతుల పేరుతో సైబర్ కేటుగాళ్లు జీవితా రాజశేఖర్ ను లక్షన్నర మోసం చేశారు. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామంటూ చీటింగ్ చేశారు. తెలిసినవారి పేరు చెప్పి సైబర్ మోసగాళ్లు జీవితారాజశేఖర్‌కు టోకరా వేశారు. తెలిసినవాళ్లు అని నమ్మి జీవితా రాజశేఖర్ మేనేజర్ లక్షన్నర నగదు బదిలీ చేశారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులను ఆశ్రయించారు జీవితా రాజశేఖర్. ఈ కేసును విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు చెన్నైకి చెందిన నరేష్‌ని అరెస్టు చేశారు. నిందితుడు నరేష్ పలువురు నటీనటులతోపాటు నిర్మాతలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆఫర్ల పేరుతో సామాన్యులతో పాటు ప్రముఖులను మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాడు నరేష్ సినీ నటీనటులు, నిర్మాతలకు టోకరా వేశాడు. సినీ నటి జీవితా రాజశేఖర్ ను సైబర్ నేరగాడు మోసం చేశాడు. ఇటీవలే జీవిత రాజశేఖర్ కు జియో నెట్‌వర్క్‌కు సంబంధించిన వైఫై ఉంది. ఆ నెట్‌వర్క్‌ని ఇన్‌స్టాల్ చేసిన వ్యక్తినని చెబుతూ ఒక గుర్తు తెలియని వ్యక్తి జీవితకు ఫోన్ చేశాడు. మీ ఇంట్లో జియో నెట్‌వర్క్ వైఫై ఇన్‌స్టాల్ చేసింది తానేనని చెప్పి ఇటీవలే తనకు ప్రమోషన్ వచ్చిందని నమ్మించాడు. ప్రస్తుతం తాను జియో వస్తువులకు సంబంధించి అమ్మకాలు జరుపుతున్నానని చెప్పి అవి సేల్ చేస్తే తనకు మరో ప్రమోషన్ వస్తుందని జీవితా రాజశేఖర్‌కు ను నమ్మించాడు. జీవితకు తెలిసిన పలువురి పేర్లు చెప్పడంతో నిజమే అని నమ్మిన ఆమె... తన మేనేజర్ ఆ విషయం ఏంటో చూడాలని చెప్పారు. ఓ వస్తువు కొని అతని ఎదుగుదలకు సహకారం అందించాలని తన మేనేజర్ కు చెప్పారు.
నరేష్ వలలో చిక్కిన నిర్మాతలు, నటీనటులు
జీవితా రాజశేఖర్ చెప్పడంతో మేనేజర్ ఆ వ్యక్తితో మాట్లాడారు. సగం ధరకే జియో ఉత్పత్తులు ఇస్తానంటూ వివరాలు తెలిపాడు సైబర్ కేటుగాడు. వీటిల్లో లక్షన్నర విలువ చేసే జియో వస్తువులను మేనేజర్ ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన అమౌంట్ పంపించాలని సైబర్ నేరగాడు కోరాడు. ఇదంతా నమ్మిన మేనేజర్ ఆ వ్యక్తి అకౌంట్‌లోకి లక్షన్నర నగదు పంపించారు. మనీ ట్రాన్స్‌ఫర్ అవ్వగానే ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన జీవితా రాజశేఖర్ మేనేజర్ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. ఈ ఘటనపై జీవితా రాజశేఖర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి సెల్ ఫోన్ డాటా ఆధారంగా అతడిని చెన్నైలో గుర్తించారు. నిందితుడు నరేష్‌గా గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు చెన్నైలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నరేష్ గతంలో పలువురు నిర్మాతలు, నటీనటులను ఇదే తరహాలో మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అవార్డులు ఇప్పిస్తామని చెప్పి మోసాలు చేశాడు. చాలా మంది ప్రొడ్యూసర్లు, నటీనటులు నరేష్ మాయమాటలు నమ్మి లక్షల్లో డబ్బులు సమర్పించుకున్నట్లు గుర్తించారు.