Hyderabad Rave Party: హైదరాబాద్ శివారు రిసార్టులో యువతులతో పార్టీ, మఫ్టీలో వెళ్లి ఆటకట్టించిన పోలీసులు
Hyderabad Crime News | హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో యువతులతో పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు భగ్నం చేశారు. నిర్వాహకులను, పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసి కొందరు పిచ్చి పిచ్చి పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మొయినాబాద్ ఫాంహౌస్‌లో కేవలం మైనర్లు టార్గెట్ చేసి ఓ డీజే పార్టీ నిర్వహించడం తెలిసిందే. పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఆ పార్టీని భగ్నం చేశారు. తాజాగా హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో మంగళవారం జరుగుతున్న పార్టీని ఎస్‌వోటీ పోలీసులు అడ్డుకున్నారు. యువతులను తీసుకొచ్చి అసభ్యకర రీతిలో డ్యాన్సులు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
రిసార్టులో గుట్టుచప్పుడు కాకుండా పార్టీ
మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో జరుగుతున్న పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీ ఫెర్టిలైజర్ యజమానుల కోసం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులతో అసభ్యకర రీతిలో నృత్యాలు చేయించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆకస్మిక దాడులు చేసి పార్టీని అడ్డుకుని నిందితులను అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు.
ఫర్టిలైజర్స్ ఓనర్ల కోసం ప్రైవేట్ పార్టీ
పోలీసుల వివరాల ప్రకారం.. రాక్‌స్టార్ ఫెర్టిలైజర్ యజమాని సైదారెడ్డి, వేద అగ్రి ఫెర్టిలైజర్‌కు చెందిన డీలర్ తిరుపతిరెడ్డి కలిసి మహేశ్వరం మండలంలోని కె.చంద్రారెడ్డి రిసార్టులో మంగళవారం పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో మొత్తం 56 మంది ఫెర్టిలైజర్ ఓనర్స్, 20 మంది వరకు మహిళలు, యువతులు పాల్గొన్నారు.
విదేశీ మద్యం స్వాధీనం, కేసు నమోదు
పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న మహేశ్వరం పోలీసులు మఫ్టీలో అక్కడకు వెళ్లారు. ఏం జరుగుతుందో కాసేపు గమనించిన ఎస్‌వోటీ పోలీసులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. రిసార్టులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భారీగా విదేశీ మద్యం లభ్యమైంది. యువతులు, మహిళల్ని తీసుకొచ్చి తమకు ఇష్టం వచ్చినట్లుగా నిర్వాహకులు వారితో డ్సాన్సులు చేపించారు. పార్టీలో పాల్గొన్న ఫర్టిలైజర్స్ ఓనర్స్, నిర్వాహకులతో పాటు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గతంలో ఇలాంటివి ఏమైనా చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.






















