Students Protest: హైదరాబాద్ రాచకొండలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ కళాశాల విద్యార్థిని.. ఫుట్ పాత్ మీద నుంచి జారిపడింది. అబ్దుల్లాపూర్ మెట్ లోని అవంతి కాలేజీ విద్యార్థిని రోజులాగే ఆర్టీసీ బస్సు ఎక్కి కళాశాలకు బయలు దేరింది. అయితే జనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. కాలేజీకి లేటవుతుందని భావించిన విద్యార్థి అదే బస్సులో ఎక్కింది. ప్రమాదవశాత్తు బస్సు నడుస్తుండగానే కాలు జారి కింద పడిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికకి తరలించారు. అయితే కాలేజీకి వెళ్లే సమయానికి ఆర్టీసీ బస్సులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్లే.. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. 


విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థుల ఆధ్వర్యంలో.. హయత్ నగర్ బస్టాండు ఎదుట ధర్నాకి దిగారు. కాలేజీ టైములో ఆర్టీసీ బస్సులను పెంచాలంటూ డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థి ఆర్టీసీ బస్సు పాస్ కోసం నెలకు 450 రూపాయలు కడుతున్నారని.. అయినా వారికి బస్సులో కూర్చునే వీలు లేకుండా ఉంటోందని తెలిపారు. బస్సులు పెంచితేనే ఇలాంటి ప్రమాదాలు జరగవని అన్నారు. అయితే ఈ ధర్నాలో అవంతి కాలశాల విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ప్రమాదంలో గాయపడ్డ అమ్మాయికి ఆర్టీసీ యాజమాన్యం న్యాయం చేయాలని, ఆసుపత్రి ఖర్చులు మొత్తం భరించాలని విద్యార్థులు కోరారు. 


ఇటీవలే మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం - ముగ్గురు దుర్మరణం 


అరగంటలో గమ్య స్థానానికి చేరుకుంటామనుకుంటుండగా.. నిద్రమత్తులో వాహనం నడిపి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టాడు ఓ డ్రైవర్. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ఉండగా.. ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 


మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఓఆర్ఆర్ వద్ద అర్ధరాత్రి టాటా వాహనo, గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ కు ఫోన్ చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను యశోద ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది..


క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాద సమయంలో టాటాఏస్ వాహనంలో మొత్తం 12 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. గుమాడిదల్లా నుంచి శ్రీశైలం దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక మరో అరగంటలో గమ్యస్థలానికి చేరుకుంటాం అనుకునేలోపే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడం వల్ల తన ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టాడని.. నిద్ర మత్తు వల్లే డ్రైవర్ తో సహా ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారని మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గతంలో కూడా సదరు డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడంతో.. అతడిని పనిలో పెట్టుకున్న యజమాని సదరు డ్రైవర్ ను తొలగించినట్లుగా తెలిసిందని చెప్పుకొచ్చారు.