Building Collapse | హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. అంజయ్య నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. నాలా పక్కన చిన్న స్థలంలో 7 అంతస్తులలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అక్రమంగా నిర్మిస్తున్నారని స్థానికంగా వినిపిస్తోంది. బిల్డింగ్ కూలిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేష్, మహబత్‌గా పోలీసులు గుర్తించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది.
పక్కన 10 ఫ్లాట్స్ వరకు డ్యామేజీ..
టైల్స్, ఎలక్ట్రీషియన్ పనులు చేస్తున్న సమయంలో బిల్డింగ్ కూలిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న బిల్డింగ్ మీద శిథిలాలు పడ్డాయి. దాంతో పక్కనున్న బిల్డింగ్స్‌లో 10 వరకు ఫ్లాట్స్ డ్యామేజీ అయ్యాయి. సమీపంలో ఉన్న హాస్టల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సాయంత్రం కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే జనసంచారం ఎక్కువగా ఉండి భారీగా ప్రాణనష్టం జరిగేదని స్థానిక అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు.
కేవలం 50 గజాల్లో నాలాను అనుకుని ఉన్న చోట ఆ యజమాని ఏడు అంతస్తుల బిల్డింగ్ నిర్మించారు. అక్రమంగా చేపట్టిన ఈ భవనం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చిందని త్వరలో అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని స్థానికులు తెలిపారు. కానీ నిర్మాణంలో లోపాలు, నాణ్యత లేకపోవడంతో బిల్డింగ్ ఒక్కసారి కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది.
