Hyderabad Attapur: చిన్న పిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీములు, లాలీ పప్స్ ఎంతగా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది పిల్లాడి నుంచి పదేళ్ల పిల్లలు వాటిని మరింత ఎక్కువగా తింటుంటారు. ఎక్కడ కనిపించినా కొనేంత వరకు తల్లిదండ్రులను వదిలి పెట్టరు. పిల్లలు బాగా మారాం చేస్తున్నారు కదా అని మనం కూడా పిల్లల కోసం వాటిని కొంటుంటాం. కానీ అలాంటివే మన పిల్లలను ప్రాణాలు కూడా తీస్తాయి. వీటికే ఇలా జరుగుతుందా అనుకుంటున్నారా.. జరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే నకిలీ చాక్లెట్లు, ఐస్ క్రీంలు తయారు చేస్తుంటే కాస్త తక్కువ ధరకు అమ్ముతుంటారు. వాటిలో ప్రమాదకర రసాయనాలను కలిపి పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతారు. హా అదెక్కడో జరుగుతుంది లెండి.. తినిపిస్తే ఏం కాదనుకుంటే మీరు పెద్ద తప్పే చేసిన వాళ్లు అవుతారు. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లోనే నకిలీ చాక్లెట్లు, లాలీ పప్స్ తయారు చేసే కేంద్రం బయట పడింది.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని అత్తాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల మధ్యనే అక్రమంగా చాక్లెట్ల పరిశ్రమ దందాను కొందరు మొదలుపెట్టారు. అంతే కాదండోయ్ మాదకర రసాయన పదార్థాలు, కలుషిత నీటితో చాక్లెట్లు, లాలీ పప్స్ తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిలువ ఉంచిన పానకంతోనే వాటిని తయారు చేస్తున్నారు. అలాగే వాటిని నేరుగా తీసుకెళ్లి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న తయారీ కేంద్రంపై దాడులు జరిపారు. డ్రమ్ముల్లో నిలువ ఉంచిన పానకాన్ని పారబోశారు. అయితే నిందితులు తప్పించుకున్నారు.
ఇటీవలే ఆహార కల్తీ చేస్తే ఉపేక్షించమన్న జీహెచ్ఎంసీ
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీపై హెల్త్ అడిషనల్ కమిషనర్ శ్రుతి ఓజాతో కలిసి మేయర్ సమీక్షించారు. నగరంలో కల్తీ నియంత్రణకు ఏర్పాటుచేసిన పుడ్ ఆన్ వీల్స్ ద్వారా తప్పనిసరిగా తనిఖీలు చేసి కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మేయర్ విజయలక్ష్మీ. ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిధిలో షాపులను, రెస్టారెంట్లను విధిగా తనిఖీ చేసి, కల్తీ ఉన్నపక్షంలో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మేయర్ సూచించారు. కొందరు అధికారులు నామమాత్రంగా చెక్‌చేసి, కల్తీ ఉన్నట్టు రుజువైనా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటున్నారని, అది తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. ఇకనైనా వారు తమ పనితీరు మార్చుకోవాలని సూచించారు. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని మేయర్ హెచ్చరించారు గతంలో రోజువారి తనిఖీల లెక్కలు పంపమని ఆదేశించినా, ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి సమాచారం ఇవ్వలేదని మేయర్ అసహనం వ్యక్తంచేశారు. స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, మీల్స్ సెంటర్లు, హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లను రెగ్యులర్ తనిఖీలు చేయాలని గట్టిగా ఆదేశించారు.