Adibatla Kidnap Case : హైదరాబాద్ లో సంచలమైన ఆదిభట్ల యువతి వైశాలి కిడ్నాప్ కేసు ములుపులు తిరుగుతోంది. వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఇటీవల గోవాలో అరెస్టు చేశారు పోలీసులు. ఈ అరెస్టుకు ముందు నవీన్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అందులో తనకు ఏ పాపం తెలియదని, అంతా యువతే చేసిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే తాజాగా నవీన్ రెడ్డి కుట్ర వెలుగులోకి వచ్చింది. వైశాలితో వివాహం జరిగిందని నవీన్ రెడ్డి చెప్పిన మాటలు అవాస్తమని పోలీసులు నిర్థారించారు. అసలు వైశాలితో వివాహం జరగలేదని పోలీసుల సమక్షంలో నవీన్ నిజం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. వైశాలికి కుదిరిన పెళ్లి చెడగొట్టేందుకు నవీన్ రెడ్డి ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. 


పెళ్లి డ్రామా 


రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన వైశాలి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి నుంచి పోలీసులు వాస్తవాలు రాబడుతున్నారు. రిమాండ్‌ రిపోర్టులో నవీన్‌ రెడ్డి వైశాలికి పెళ్లి కాలేదని వాస్తవాన్ని పోలీసులు వెల్లడించారు. వైశాలి పెళ్లిని అడ్డుకునేందుకే బాపట్ల పెళ్లి డ్రామా ఆడినట్లు నవీన్ ఒప్పుకున్నాడు.  తన వద్ద పనిచేసే వాళ్లతో వైశాలి ఇంటిపై దాడిచేయించానన్నాడు నవీన్‌ రెడ్డి. తనను పెళ్లి చేసుకోలేదనే కోపంతో కిడ్నాప్‌ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మిస్టర్‌ టీకి చెందిన 40 మందితో వైశాలి ఇంటిపై దాడి చేయించినట్లు చెప్పాడు. ఈ కిడ్నాప్‌ ఉదంతం సంచలనం కావడంతో భయంతో గోవా పారిపోయినట్లు పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు.  అయితే పెళ్లి డ్రామా అబద్దమని తెలిసిన తర్వాత... వైశాలి తనని మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో నవీన్ రెడ్డి చెప్పిన విషయాలు అవాస్తవాలు కావొచ్చన్న అనుమానాలు రేగుతున్నాయి. 


సెల్ఫీ వీడియో 


సెల్ఫీ వీడియోలో నవీన్ రెడ్డి ఓపెన్ అయ్యాడు. తాను చేసింది తప్పేనని ... కానీ దాని వెనుక చాలా పెయిన్ దాగుందన్నాడు.  తనకున్న కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగానే తాను పోలీసులకు సరెండర్ కాలేదని పేర్కొన్నాడు.ఈ కిడ్నాప్ విషయంలో తనను మాత్రమే నెగెటివ్‌గా చూస్తున్న వాళ్లంతా.. ఒకవేళ తనకు జరిగినట్టే ఒక అమ్మాయికి జరిగి ఉంటే.. ఇలానే స్పందించే వాళ్లా అని ప్రశ్నించాడు.  ఈ విషయాన్ని ఒక అమ్మాయికి జరిగిందనో.. ఒక అబ్బాయికి జరిగిందనో చూడకుండా.. ఒక ఫ్యామిలీకి, ఒక మనసుకు సంబంధించిన విషయంగా చూడాలని రిక్వెస్ట్ చేశాడు.


అసలేం జరిగింది? 


 హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సంచలనం అయింది. ప్రేమించిన యువతి మరొకరితో పెళ్లికి సిద్ధమవ్వడంతో ఆమెను కిడ్నాప్ చేశాడు యువకుడు. అయితే ఆ కిడ్నాప్ కూడా సినీఫక్కీలో చేశారు. 40 మంది అనుచరులతో యువతి ఇంటిపై దాడి చేసి తండ్రిని కొట్టి యువతిని కిడ్నాప్ చేశాడు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు. బొంగులూరులోని స్పోర్ట్స్‌ అకాడమీలో చదువుతున్న యువతికి నవీన్‌ రెడ్డితో పరిచయం ఏర్పడింది. నవీన్‌ రెడ్డి యువతి ఫోన్ నంబర్‌ తీసుకొని తరచూ ఫోన్ చేసేవాడు. ఆమెతో కలిసి ఫొటోలు తీసుకునేవాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు నవీన్. తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పింది. అయితే యువతి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్‌ రెడ్డి ప్రయత్నించాడు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడంతో వారిపై నవీన్‌ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. యువతి పేరుతో ఓ నకిలీ ఇన్‌స్టా గ్రామ్‌ అకౌంట్ క్రియేట్ చేశాడు. యువతితో కలిసి దిగిన ఫొటోలు పోస్టు చేస్తూ వైరల్ చేసేవాడు. ఆరు నెలల క్రితం యువతి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు నవీన్ రెడ్డి. ఇన్ స్టాలో నకిలీ ఖాతా గమనించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆదిభట్ల పోలీసులు ఐటీ చట్టం కింద నవీన్‌పై కేసు నమోదు చేశారు.