Shakeel son Sahil Accident case: హైదరాబాద్‌ బేగంపేట్‌లోని ప్రజాభవన్‌ దగ్గర కారుతో బారికేడ్లను ధ్వంసం చేసిన కేసు విచారణలో కీలక విషయాలు  బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడు మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌గా గుర్తించారు. అంతేకాదు.. అతన్ని తప్పించేందుకు సినిమా తరహాలో పెద్ద ప్లాన్‌  వేశారు. నిందితుని తప్పించి... అతని డ్రైవర్‌ను ఇరికించారు. ఇందుకు ఇన్​స్పెక్టర్​ దుర్గారావు సహకరించినట్టు తేలింది. అయనపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు  ఉన్నతాధికారులు. అసలు నిందితుడు సాహిల్‌ ఎలా తప్పించుకున్నాడు..? అతని స్థానంలో డ్రైవర్‌ను ఎలా పెట్టారు..? ఇందులో పోలీసుల పాత్ర ఏంటి...? 


అసలు ఏం జరిగిందంటే..
ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ బేగంపేట్ ప్రజాభవన్ దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ ప్రజాభవన్​ దగ్గర కారుతో బారికేడ్లను ధ్వంసం చేశారు. ఈ  ఘటన సంచలనం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు  సాహిల్‌ అని గుర్తించారు. అంతే... ఆ తర్వాత కథ మొత్తం మార్చేశారు. 


సీఐ కనుసన్నల్లోనే 


ప్రమాదం జరిగిన రోజున రాత్రి విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు ఉన్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసిన కారు ఉన్న సాహిల్‌ను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతన్ని కానిస్టేబు అప్పగించి... పక్కనే ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు బ్రీత్‌ఎనలైజర్‌ పరీక్ష కోసం పంపారు. బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా.. ఫుల్లుగా మద్యం తాగినట్లు తెలిసింది. అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఒత్తిడితో సాహిల్‌ను తప్పించేందుకు పోలీసులు పక్కా ప్లాన్‌ చేశారు. బ్రీత్ అనలైజర్‌ పరీక్షల తర్వాత... నిందితుడు అక్కడి నుంచి పంపేశాడు. అతని స్థానంలో డ్రైవర్‌పై కేసు పెట్టారు. విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం... ఉన్నతాధికారులు విచారణ వేయడంతో... సాహిలే తప్పించుకుని పారిపోయాడని కథ అల్లారు. బ్రీత్ అనలైజర్‌ పరీక్ష తర్వాత సాహిల్‌ తప్పించుకొన్నాడని.. అప్పటికే బయటు ఉన్న కారులో ఎక్కి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత... తన డ్రైవర్‌ను తన స్థానంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపాడు. అతడితో ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు వాంగ్మూలం ఇప్పించేలా ఒత్తడి చేశాడని పోలీసులు చెప్తున్నారు. అందుకే సాహిల్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి కేసు పెట్టామని తెలపారు. 


పోలీస్‌ కమిషనర్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ దర్యాప్తు చేయించగా... అసలు విషయం బయటపడింది. ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు ఉన్నతాధికారులు. స్టేషన్‌లోని కెమరాల ఫుటేజీని చూశాక.. సాహిల్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా సాహిల్‌ను తప్పించినట్లు నిర్ధారించారు డీసీపీ. ఆ రిపోర్ట్‌ను పోలీస్‌ కమిషనర్‌ ఇచ్చారు. దాంతో పంజాగుట్ట సీఐ దుర్గారావు, ASI విజయ్‌కాంత్‌ను సస్పెండ్‌ చేశారు.


ఈ కేసు ఎక్కడ తన వరకు వస్తుందోనని ముందే పసిగట్టిన సాహిల్‌.. దేశం విడిచిపారిపోయాడు. ముంబై మీదుగా దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో అలర్టయిన పోలీసులు.. అతడిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో సాహిల్‌ను ఏ1గా చేర్చారు. అంతేకాదు సాహిల్ గతంలో ఏం నేరాలు చేశాడన్న దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ఏడాది మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అర్థరాత్రి కారు ఢీకొట్టిన ఘటనలో చిన్నారి చనిపోయింది. ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ఆ కారు ఎమ్మెల్యే షకీల్‌దే. ప్రమాదం జరిగినప్పుడు సాహిల్ కారులోనే ఉన్నా.. డ్రైవింగ్ సీట్లో వేరేవాళ్లు ఉన్నట్టు కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు వివరాలను కూడా పరిశీలిస్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ.