మేడ్చల్: పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) మద్దతున్న ఒక ముఠాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న జయీద్‌ఖాన్‌ అనే 22 ఏళ్ల యువకుడిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.  మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్‌ఖాన్‌, ఈ ఏడాది ఫిబ్రవరిలో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. ఇక్కడ మేడ్చల్‌లోని ముబారక్‌ రెస్టారెంట్‌లో సర్వర్‌గా పనిలో చేరాడు. ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా పిచ్చితో రీల్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసేవాడు. ఈ క్రమంలోనే రెండు బొమ్మ తుపాకులతో (Toy Pistols) అతడు చేసిన వీడియోలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రియాక్షన్ రావడంతో, అలాంటి వీడియోలను మరిన్ని చేసి అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు.

Continues below advertisement

అయితే, సామాజిక మాధ్యమాల్లో జయీద్‌ఖాన్‌ పోస్ట్ చేసిన ఈ వీడియోలను పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ సానుభూతిపరులు హబీబ్, రాణాహుస్సేన్‌లు గమనించారు. పాక్ ఐఎస్‌ఐ కీలక సభ్యుడైన షహబాద్‌తో నేరుగా సంబంధాలున్న ఈ ఇద్దరు.. జయీద్‌ఖాన్‌ వీడియోలకు లైక్‌లు కొడుతూ, కామెంట్స్ పెడుతూ మెల్లగా అతనికి దగ్గరయ్యారు. అనంతరం షహబాద్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జయీద్‌ఖాన్‌తో చాటింగ్ మొదలుపెట్టారు. మాటలతో అతడిని రెచ్చగొడుతూ.. తాము చెప్పినట్లు వింటే అసలైన తుపాకులు పంపుతామంటూ ఆశ చూపారు. వీరి మాటలకు ఆకర్షితుడైన జయీద్, చాటింగ్‌లో నాకు అవకాశం ఇస్తే పాకిస్థాన్‌ కూడా వస్తానని వారితో అన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సోషల్ మీడియాలో జయీద్‌ఖాన్‌ పెడుతున్న రీల్స్, అతని అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచిన కేంద్ర రక్షణ సంస్థలు మేడ్చల్‌ పోలీసులను అప్రమత్తం చేశాయి. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు జయీద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని గదిలో ఉన్న 2 నకిలీ తుపాకులు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను పరిశీలించగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి పాక్ ఐఎస్‌ఐ ముఠా సభ్యులతో జరిపిన వాట్సాప్‌ చాటింగ్, వాయిస్‌కాల్స్, స్క్రీన్‌షాట్‌లు గుర్తించారు. మరిన్ని ఆధారాల కోసం నిందితుడి ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు (FSL) పంపారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో, పోలీసులు జయీద్ ఖాన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అతడికి పాక్ ఐఎస్ఐతో ఉన్న లింకులు, ఇంకా ఏదైనా ఉగ్రసంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడా.. వారు చెప్పిన పనులు ఏమైనా చేశాడా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. 

Continues below advertisement