గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపై తండ్రే పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడు. ఈ అమానుషానికి నిందితుడి మొదటి భార్య కూడా సహకరించింది. 

Continues below advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గద్వాల జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఒక వ్యక్తికి వివాహమైనా పిల్లలు కలగలేదనే కారణంతో,  మొదటి భార్య తన చెల్లెలితో భర్తకు రెండో వివాహం జరిపించింది. రెండో భార్యకు నలుగురు పిల్లలు జన్మించగా, కొన్నేళ్ళ తరువాత మొదటి భార్యకు సైతం ఇద్దరు సంతానం కలిగారు.

నిందితుడు తన రెండో భార్యకు పుట్టిన 16 ఏళ్ల మైనర్ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెదిరింపులకు పాల్పడి కన్నబిడ్డపైనే ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చగా, విషయం బయటపడకుండా ఉండేందుకు నిందితుడి మొదటి భార్య గుట్టుచప్పుడు కాకుండా బాధితురాలికి  అబార్షన్ చేయించింది. 

Continues below advertisement

కొన్ని రోజులకు బాధిత బాలిక ఈ దారుణాన్ని స్థానికంగా ఉండే మరో మహిళకు వివరించడంతో, ఆమె వెంటనే బాలిక కన్నతల్లికి చెప్పింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై నిందితుడి రెండోభార్య, కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు బాలికపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఆమె తండ్రితో పాటు ఆ దారుణానికి సహకరించిన మొదటి భార్యను సైతం అరెస్టు చేశారు.

ఇటువంటి అమానుష ఘటనలు జరిగినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటారుపోక్సో (POCSO) చట్టం: మైనర్లపై జరిగే లైంగిక వేధింపుల కేసులను 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్' (POCSO) చట్టం కింద పోలీసులు నమోదు చేస్తారు. దీని కింద నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు లేదా కొన్ని సందర్భాలలో మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.

చైల్డ్ హెల్ప్ లైన్ (1098): పిల్లలపై వేధింపులు లేదా అన్యాయం జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. 

బాధితులకు భరోసా: ప్రభుత్వం ఇలాంటి బాధితులకు వైద్య సహాయంతో పాటు, 'సఖి' (One Stop Centre) కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ తో పాటు ఉచిత న్యాయ సహాయం అందిస్తుంది.

నేరానికి సహకరించడం: ఒక నేరం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపకుండా సహకరించినా (అబార్షన్ చేయడం వంటివి చేసినా), సమాచారం దాచిపెట్టినా వారిని కూడా చట్టం దృష్టిలో ప్రధాన నిందితులుగానే పరిగణించి చర్యలు తీసుకుంటారు.