Crime News : గుంటూరు జిల్లాలో ఏడాదికో పెళ్లి చేసుకుని మహిళ్లని వంచిస్తున్న నిత్య పెళ్లికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఎన్నారై. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని తనను ఐదో పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు ఐదో భార్య చేసిన ఫిర్యాదు చేశారు. సతీష్ కు ఇంతకు ముందే పెళ్లి అయి విడాకులు తీసుకున్నాడని… మంచివాడని బెంగుళూరులో తెలిసిన వాళ్లు చెప్పగా పెళ్లి కుదుర్చుకున్నట్లు ఐదో భార్య తెలిపింది. అయితే ఇలా పెళ్లిళ్లు చేసుకోవడం ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఆయన స్టైల్ అని తెలియడంతో పోలీసుల్ని ఆశ్రయించింది.
జూన్ 16న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగిందని. జూలై 2న సతీష్ వ్యవహారం అనుమానం వచ్చి గూగుల్ లో సెర్చ్ చేయగా అతని బండారం బయటపడిందని ఆమె తెలిపింది. అన్ని ఆధారాలు సేకరించి దిశపోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు సతీష్ బాబును, అతని తండ్రి వీరభద్రరావును అరెస్ట్ చేశారు. సతీష్ పై గతంలోనే రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు నిందితుడిని జిల్లా జైలుకు తరలించారు.
ర్నాటి సతీష్‌బాబు లండన్‌లో ఎంబీఎ చదివి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ ఏడాదిలో ఒకటి, రెండు నెలలు ఇక్కడకు వస్తాడు. ఇంతలో విజయవాడలో ఉన్న అతని తల్లిదండ్రులు 46 ఏళ్ల వయసున్న తమ కుమారుడిని అందంగా ఫొటోలు తీసి పెళ్లి చూపులకు సిద్ధం చేస్తారు. మా కుమారుడు ఎన్‌ఆర్‌ఐ...పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని అమెరికా తీసుకువెళతాడంటూ నమ్మించి రూ.లక్షల్లో కట్నకానుకలు, వందల గ్రాముల బంగారాన్ని తీసుకొని వివాహం చేస్తారు. అధికమొత్తంలో కట్నకానుకలు ఇచ్చేవాళ్లని తెలిస్తే రెండో సంబంధం అమ్మాయిలైనా ఓకే చెప్పేసి తాళి కట్టేస్తాడు.
ఇతగాడికి బట్టతల కావడంతో ఆవిషయం బయటపడకుండా విగ్గుపెట్టి నమ్మించే యత్నం చేస్తాడు. పెళ్లిపీటలపై జిలకర్రబెల్లం పెట్టే క్రమంలో యువతి గుర్తిస్తే తనకు కొద్దిరోజుల కిందట చర్మవ్యాధి రావడంతో జుట్టు ఊడిపోయిందని త్వరలో వచ్చేస్తుందంటాడు. పెళ్లి చేసుకొని అందమైన భవంతిలో సకలభోగాలతో నెల, రెండు నెలలు కాపురం చేస్తాడు. ఆ మహిళల వీడియోలు చరవాణిలో తీసుకుంటాడు. అమ్మాయి అభ్యంతరం చెబితే మాయమాటలు చెప్పి తాను అమెరికా వెళ్లినప్పుడు ఈ గుర్తులు చూసుకోవడానికంటూ ఏమార్చుతాడు. ఆ తర్వాత అమెరికా చెక్కేస్తాడు. ఈ క్రమంలో కొందరు మహిళలు అతని గురించి తెలుసుకొని ప్రశ్నిస్తే డబ్బులిచ్చి సెటిల్‌మెంట్ చేసుకుంటాడు. పట్టుబట్టిన వారికి విడాకులు ఇచ్చేస్తాడు. చివరికి పాపం పండటంతో అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది.