Guntur Crime News: ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్ లో నాలుగు నెలల గర్భిణీపై భర్త కళ్లెదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులు ఇద్దరికీ జిల్లా సెషన్స్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రేపల్లె నేతాజీ నగర్ కు చెందిన  20 ఏళ్ల పాలుబోయిన విజయకృష్ణ, 25 ఏళ్ల పాలుదురి నిఖిల్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. గుంటూరు జిల్లా నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏ3గా ఉన్న నిందితుడు మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. 


వివాహితపై కీచకులు అఘాయిత్యం.. 
2022 మే ఒకటో తేదీన నాలుగు నెలల గర్భిణీ అయిన ఎస్సీ మహిళ.. ఆమె భర్త, ముగ్గురు పిల్లలతో రాత్రి రైల్వే స్టేషన్ లో పడుకుంది. అయితే అటుగా వచ్చిన ముగ్గురు నిందితులు.. ఆమె భర్తతో కావాలని గొడవ పెట్టుకున్నారు. ఆపై గర్భిణీ అయిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్త కళ్లెదుటే ఆమెను లైంగికంగా వేధించారు. ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్తున్న ఈ జంట.. మార్గ మధ్యంలో రైల్వే స్టేషన్ లో పడుకోగా.. నిందితులు ఆ అరాచకానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు మహిళపై అత్యాచారం చేయగా.. మరో యువకుడు వీరికి సాయం చేశాడు. అయితే భార్యకు నరకం చూపిస్తున్న నిందితుల వద్ద నుంచి తప్పించుకొని రైల్వే పోలీసు కార్యాలయం వద్దకు వెళ్లి ఎంతగా అరిచినా అతని ఆక్రందన విని ఒక్కరు కూడా స్పందించలేదు. అలాగే ఎవరిని సాయం అడిగినా ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ దారుణాన్ని ఆపలేరు. 


ఇద్దరు పిల్లలను ప్లాట్ ఫాంపై అలాగే వదిలేసి.. ఓ బిడ్డను భుజాన వేసుకొని అర్ధరాత్రి వేళ భార్యను కాపాడుకునేందుకు ఆయన పోలీస్ స్టేషన్ చేరుకున్న దయనీయ స్థితి ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు వెంటనే స్పందించి అక్కడకు చేరుకునే వరకూ ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లా రేపల్లె పోలీస్ స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


కృష్ణా జిల్లా నాగాయలంకలో ఉపాధి పనుల నిమిత్తం బాధితురాలు భర్త, ముగ్గురు పిల్లలతో కలిపి 2022 మే ఒకటో తేదీన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి బయల్దేరారు. గుంటూరు తెనాలి మీదుగా రేపల్లె రైల్వే స్టేషన్ కు శనిరావం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకున్నారు. అప్పుడు నాగాయలంక వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో బాధిత కుటుంబం రైల్వే స్టేషన్ లోనే నిద్రించింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు యువకులు వారి వద్దకు వచ్చారు. బాధితురాలి భర్తను నిద్రలేపి సమయం ఎంత అయిందని అడిగారు. తన వద్ద వాచీ లేదని అతను సమాధానం ఇవ్వడంతో ఆ ముగ్గురూ అతని గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు. అతని వద్ద ఉన్న రూ.750 లాక్కున్నారు. బాధితురాలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిలో ఇద్దరు ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. మరొకరు ఆమె భర్తను నిర్బంధించారు. బాధితురాలిని ప్లాట్ ఫాం చివరి వరకూ ఈడ్చుకుంటూ వెళ్లి భర్త కళ్లెదుటే ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. రైల్వే స్టేషన్ లోనే ఈ ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు ఆమెను చిత్ర హింసలు పెట్టారు.