Government Teacher Murder In Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో (Madanapalle) గురువారం తెల్లవారుజామున ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ఎగువకురవంకకు చెందిన టీచర్ దొరస్వామిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఆయన దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దొరస్వామి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కురవంక పార్క్ వద్ద ఆంజనేయ గుడికి సమీపంలో ఇంట్లోని మిద్దెపై ఈ హత్య జరిగింది. మృతుని భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. ఆయన కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన తలపై ఎవరో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వలీబ్ బసు వివరాలు సేకరించారు. ఎవరో పథకం ప్రకారం దొరస్వామిని దారుణంగా హత్య చేసినట్లు.. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఆయన కుమార్తె ఇంట్లోనే ఉండడంతో ఆమెను విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.