Gold Seized at Raikal Tollplaza Hyderabad News | హైదరాబాద్: కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎంతగా పెరిగిపోతున్నాయో, మరోవైపు స్మగ్లింగ్ లో సైతం నేరస్తులు కొత్త మార్గాలు వెతుక్కుంటూ పోలీసులకు ఛాలెంజ్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం తరలిస్తున్న గ్యాంగ్ ను డీఆర్ఐ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్న 4.7 కేజీల విదేశీ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
విదేశీ బంగారాన్ని ఓ గ్యాంగ్ నగరానికి తరలిస్తుందని అధికారులకు సమాచారం అందింది. దాంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కోయంబత్తూరు నుంచి వస్తుండగా హైదరాబాద్ శివారులోని రాయికల్ టోల్‌ప్లాజా (Toll Plaza) వద్ద ఓ కారును ఆపిన అధికారులు సోదాలు చేశారు. కారులో మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నారు. కాగా, వారిపై అనుమానం వచ్చి, పూర్తి స్థాయిలో చెక్ చేయగా స్మగ్లింగ్ గ్యాంగ్ గుట్టు రట్టయింది. కారు హ్యాండ్ బ్రేక్ కిందవైపు ప్రత్యేకంగా తయారు చేసిన క్యావిటీలో బంగారం (Gold) దాచి తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. బంగారం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులపై కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి ఓ కారుతో పాటు 4.7 కేజీల బంగారం సీజ్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితుల్ని రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.