ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి.. రాత్రి పడుకునే వరకు చాలా మంది జీవితాల్లో అదో భాగమైపోయింది. అనేకమంది సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. అయితే అలా చేయడం వలన జరిగే అనర్థాలను చూస్తూనే ఉన్నాం. ఓ వ్యక్తి కూడా ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయం ప్రాణాల మీదకు తెచ్చింది.
భవానీపురానికి చెందిన యార్లగడ్డ డేవిడ్ విజయవాడలో ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ ఇద్దరికి రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల మాట్లాడుకున్న తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. యువతి సోమవారం సాయంత్రం యువకుడికి ఫొన్ చేసింది. మైలవరం మండలం పుల్లూరులోని మామయ్య ఇంట్లో ఉన్నానని చెప్పింది. రాత్రికి గుంటూరులో పెళ్లికి వెళ్లాలని.. తనను తీసుకెళ్లాలని కోరింది. అయితే ఇదే విషయాన్ని నమ్మేశాడు ప్రియుడు.
రాత్రి 9 గంటల సమయంలో కారులో పుల్లూరుకు వెళ్లాడు. తాను వచ్చానని చెప్పాడు. అడ్రస్ చెప్పమని కోరాడు. అయితే తన సోదరుడు వచ్చి.. తీసుకొస్తాడని యువతి చెప్పింది. ఇదే విషయాన్ని నిజం అనుకున్నాడు ప్రియుడు. కొద్దిసేపటి తర్వాత యువతి సోదరుడు, మరో వ్యక్తి వచ్చి కారులో అతడ్ని జమలాపురం వైపు తీసుకెళ్లారు. దారిలోనే బ్లేడుతో అతని మెడ, చేతులు కోసేశారు. అప్పటికే ప్రియుడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే కారులో తీసుకుని జి.కొండూరు మండలం కవులూరు, శాంతినగర్ మధ్య మార్గంలోని బుడమేరు కాలువలో పడేశారు.
ప్రియుడి దగ్గర నుంచి ఫోన్, ఉంగరాలు లాక్కొని జంప్ అయ్యారు. కారును జి.కొండూరు, చెవుటూరు గ్రామాల మధ్య జాతీయ రహదారి బైపాస్‌లో విడిచిపెట్టారు. అయితే కాలువలో పడి ప్రాణాలు కోసం పోరాడుతున్న ప్రియుడికి అదృష్టవశాత్తు దుంగ దొరకడంతో ఎలాగొలా ఒడ్డుకు వచ్చాడు. రహదారి మీద వెళ్తున్న ఆటోను ఆపి.. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫొన్ చేసి చెప్పాడు.
ఇబ్రహీంపట్నం పోలీసుల సాయంతో విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిని ప్రేమించానని, ఆమె రమ్మంటే వెళ్లానని.. యువకుడు ఫొటోలు చూపుతున్నాడు. ఆ యువతి ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంపైనా.. ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Crime News: భర్తను చంపితే బీమా డబ్బులొస్తాయని ప్లాన్.. ప్రియుడితో కలిసి స్కెచ్.. చివరకు..
Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి