Youngman murder: ప్రతీ ఒక్కరి లైఫ్ లో స్నేహితులకు ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. మనం పండు ముసలి వాళ్లం అవుతున్నా చిన్ననాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతూనే ఉంటాయి. చెడ్డీ దోస్తులు గుర్తుకు వస్తూనే ఉంటారు. వీలయినప్పుడల్లా వారిని కలుస్తూ.. పాత జ్ఞాపకాలు నెమరు వేస్కుంటుంటారు చాలా మంది. అయితే చెడ్డీ దోస్తులను ప్రాణంగా చూస్తుంటారు చాలా మంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే స్నేహితులు మాత్రం.. స్నేహం అన్న పదానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు. గంజాయికి అలవాటు పడి.. సులువుగా డబ్బు సంపాదించాలనకున్నారు. అందుకోసం ప్రాణ స్నేహితుడినే హతమర్చారు. 


డబ్బుల కోసమే స్నేహితుడి హత్య..


ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి ప్రాజెక్టులో ఓ యువకుడు విగతజీవిగా కనిపించడం ఇటీవల సంచలనం రేపింది. పోలీసులు అతి తక్కువ సమయంలోనే కేసును చేధించారు. గంజాయి, మద్యానికి బానిసలైన ఇద్దరు యువకులు డబ్బుల కోసం చిన్ననాటి నుంతి తమతో కలిసి ఉన్న స్నేహితుడినే చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది స్నేహితుడిని చంపడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు. చిన్నప్పటి ముగ్గురూ ఒకే చోట కనిపించే వారు డబ్బుల కోసం అంత పని చేశారంటే నమ్మశక్యంగా లేదని అంటున్నారు. కానీ నిజం అదే. దాన్ని నిందితులు కూడా ఒప్పుకున్నారు. 


అసలేమైందంటే..? 


ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఉమెందర్ కేసు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన షేక్ బిలాల్ అహ్మద్ తో పాటు మరో 17 సంవత్సరాల బాలుడు ఈ దారుణానికి ఓడగట్టినట్లు డీఎస్పీ తెలిపారు. తమ స్నేహితుడైన మీర్జా కాషిఫ్ బేగ్ వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని అమ్మి సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన నిందితులు.. పథకం ప్రకారం మృతుడిని వడ్డాడి ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళ్లి హతమర్చినట్లు పేర్కొన్నారు. అనంతరం సమీపంలోని మహరాష్ట్రలోని కిణ్వట్ కు వెళ్లి ద్విచక్ర వాహనాన్ని తనఖా పెట్టి నగదును తీసుకుని తిరిగి ఆదిలాబాద్ వచ్చినట్లు చెప్పారు. 


పిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి...


ఘటనపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడతో నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారని వివరించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఆదిలాబాద్ సీసీఎస్, 2 టౌన్ పోలీసులకు అభినందనలు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు గంజాయి మద్యానికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను సైతం ఎం చేస్తున్నారో గమనిస్తు జాగ్రత్తపడాలని సూచించారు. మద్యం, డ్రగ్స్ వంటివి వాడకుండా చూడాలని.. పిల్లలను సరైన మార్గంలో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. లేకపోతే వారి జీవితాలతో పాటు మరింత మంది జీవితాలు నాశనం అవుతాయమని డీఎస్పీ ఉమెందర్ పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి బాధ్యతగా పెంచితేనే పిల్లలు సరైన మార్గంలో నడుస్తారని... తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని వివరించారు.