Three People Died in Accident in Suryapeta District: సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 మంది కూలీలు మోతె మండలం బురకచెర్ల గ్రామానికి మిరపకోత పనుల కోసం ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారి అండర్ పాస్ వంతెన వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గమనించిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన బస్సు మధిర డిపోకు చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


చెట్టును ఢీకొన్న బైక్


అలాగే, మరోవైపు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ సమీపంలో చెట్టును బైక్ ఢీకొని ఇద్దరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. మృతులు సిద్ధాపూర్ తండాకు చెందిన కిషన్, సవాయి సింగ్ లుగా గుర్తించారు. వారు వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.


Also Read: Dastagiri News: పులివెందులలో జగన్‌పై పోటీ చేస్తా - దస్తగిరి, భద్రత కోసం తెలంగాణ సీఎంకు వినతి