Four People Died In Bhogapuram Road Accident: విజయనగరం జిల్లాలో (Vijayanagaram District) శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భోగాపురం (Bhogapuram) మండలం పోలిపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి అవతలి రోడ్డు వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ క్రమంలో అటుగా వస్తోన్న లారీ కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు శ్రీకాకుళానికి చెందిన ద్రవిడ కౌశిక్, వడ్డే అభినవ్, మణిమాల, వాహన డ్రైవర్ జయేశ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కృష్ణా జిల్లా ప్రమాదంలో..
మరోవైపు, కృష్ణా జిల్లాలోనూ జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కంకిపాడు మండలం పునాదిపాడు వద్ద కారు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో.. కారులోని ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికుల సాయంతో బయటకు తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Tiger Migration: శ్రీకాకుళం జిల్లాను వణికిస్తోన్న పెద్ద పులి - ఆ గ్రామాల్లో టెన్షన్ టెన్షన్