Konaseema Crime News: మీరు మీ ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని ఎక్క‌డైనా పార్కింగ్‌చేసి వెళ్తున్నారా.. వేసిన తాళం మీద‌గ్గ‌రే ఉంటుంది కానీ.. కానీ ఎక్క‌డైతే పార్కింగ్ చేశారో అక్క‌డ మీ వాహ‌నం ఉండ‌దు. ఎంత వెతికినా ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. ఇలా అంబేడ్క‌ర్ కోనసీమ జిల్లాలో చాలా మందికి ఎదురైన చేదు అనుభ‌వం. ల‌బోదిబోమంటూ ప‌రుగున వెళ్లి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డ‌మే మీవంత‌వుతుంది. ఇలాంటి ఓ ఘ‌రానా ముఠాను అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 38 ల‌క్ష‌ల రూపాయ‌లు విలువచేసే 38 హోండా యాక్టివ్ మోటారు సైకిళ్ల‌ను దొంగిలించిన అయిదుగురిని అరెస్ట్ చేశారు. వారి వ‌ద్ద నుంచి టూవీలర్స్‌ను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. మంగ‌ళ‌వారం అమ‌లాపురం స‌బ్ డివిజ‌న్ పోలీస్ అధికారి కార్యాల‌యం వ‌ద్ద ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్త‌పేట డీఎస్పీ సుంక‌ర ముర‌ళీ కృష్ణ త‌దిత‌ర పోలీసు అధికారుల స‌మ‌క్షంలో వివ‌రాలను వెల్ల‌డించారు. 

Continues below advertisement

తీగ దొరికిందిలా..

ఈ ఏడాది మే నెల 22న రావులపాలెం మండ‌లం పొడ‌గ‌ట్ల‌ప‌ల్లిలో ఓ ఇంటి బ‌య‌ట పార్కు చేసిన హోండా యాక్టీవా మోటారు సైకిల్ రాత్రి స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అప‌హ‌రించారు. దీనిపై స‌ద‌రు య‌జ‌మాని రావుల‌పాలెం పోలీస్ స్టేష‌న్‌లో పిర్యాదు చేశాడు. ఈ కేసుపై ద‌ర్యాప్తు చేస్తున్న క్ర‌మంలో అయిదుగురు ముఠా గుట్టు ర‌ట్టు అయ్యింది. దీంతో రావుల‌పాలెంకు చెందిన ల‌క్కోజు రాజేష్‌కుమార్‌, కాకినాడ జిల్లా పెద‌పూడి మండ‌లం జి.మామిడాడ‌కు చెందిన క‌ళ్యాణం న‌రేష్‌, గుండుప‌ల్లి సూర్య‌తేజ‌, కాకినాడ జిల్లా గండేప‌ల్లి మండ‌లం య‌ర్ర‌పాలెం గ్రామానికి చెందిన రొట్టె నాగ‌చైత‌న్య, ఆల‌పు ర‌వికుమార్‌ను అరెస్ట్‌చేశారు. 

బండిపై కూర్చుని కాలుతో త‌న్ని..

వీరు మోటారు సైకిళ్ల‌ను అప‌హ‌రించే విధానం కూడా చాలా సునాయాసంగా చేస్తార‌ని ఎస్పీ వివ‌రించారు. పార్కింగ్‌చేసిన మోటారు సైకిల్‌పై కూర్చుని రెండు కాళ్ల‌తో హ్యాండిల్ ను బ‌ల‌వంతంగా తంతారు. దీంతో హ్యాండిల్ లాక్ విరిగిపోతుంది. ఆత‌రువాత ఫ్ల‌గ్‌కు ఉన్న వైర్ త‌ప్పించి దానికి పిన్నీసు లేదా బైండింగ్ వైర్‌తో రెండిటిని క‌లిపి బండి స్టార్ట్ చేస్తారు. ఈ దొంగ‌ల ముఠాను జొన్నాడ వ‌ద్ద హైవేపై అరెస్ట్ చేసిన‌ట్లు ఎస్పీ వెల్ల‌డించారు. వీరిలో ల‌క్కోజు రాజేష్ కుమార్‌, రొట్టె నాగ‌చైత‌న్య‌పై గ‌తంలో మోటారుసైకిళ్లు దొంగ‌త‌నం కేసులు, క‌ళ్యాణం న‌రేష్‌పై ఫోక్సో కేసు ఉన్న‌ట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసులో డీఎస్పీ సుంక‌ర ముర‌ళీమోహ‌న్‌, పీఐ శేఖ‌ర్ బాబు, క్రైమ్ సీఐ ఎన్‌.కొండ‌య్య‌, రావుల‌పాలెం ఎస్సై జి.చంటి, సీసీఎస్ ఎస్సై ఏ ప‌ర‌దేశి, ఏ బాల‌కృష్ణ‌, ఏఎస్సై ఎం.సుబ్బ‌రాజు, హెచ్‌సీ కె.వెంక‌ట‌ర‌మ‌ణ‌, పీస‌లు లంకాడి శ్రీ‌ను, డి.అర్జున‌రావు, బీడీవీ ప్ర‌సాద్‌, కృష్ణ‌సాయి, శుభాక‌ర్‌, సీహెచ్‌వీ ప్ర‌సాద్‌, హ‌రిబాబుల‌ను ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు.

Continues below advertisement