India-based Telemarketing Fraud: అమెరికాలో ఉంటున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, టెక్ సపోర్ట్ పేరుతో వారి జీవితకాల పొదుపును కొల్లగొడుతున్న ఒక భారీ అంతర్జాతీయ కుంభకోణాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ FBI బట్టబయలు చేసింది. భారత్ కేంద్రంగా నడుస్తున్న ఒక కాల్ సెంటర్‌ను మూసివేయించిన ఎఫ్‌బీఐ, ఈ మోసాలకు సహకరించిన ఇద్దరు అమెరికన్ టెక్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా అరెస్టు చేసింది. సాధారణంగా భారతీయులను నైజీరియన్లు మోసం చేస్తున్నారని మనం వింటుంటాం, కానీ ఈ కేసులో కొందరు భారతీయులే అమెరికన్లను మోసం చేశారు.
ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. అమెరికన్ల కంప్యూటర్ స్క్రీన్‌లపై అకస్మాత్తుగా మీ సిస్టమ్ వైరస్ బారిన పడింది అని ఒక నకిలీ పాప్-అప్ మెసేజ్ వస్తుంది. భయపడిన వృద్ధులు ఆ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగానే, అది భారత్‌లోని కాల్ సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది. అక్కడ పనిచేసే వారు టెక్ సపోర్ట్ ఏజెంట్లలా నటించి, సాఫ్ట్‌వేర్ క్లీనింగ్ పేరుతో వందల నుండి వేల డాలర్లను వసూలు చేస్తారు. గతేడాది ఒక్క అమెరికాలోనే ఇలాంటి టెక్ సపోర్ట్ స్కామ్‌ల వల్ల ప్రజలు ఏకంగా 2.1 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.17,500 కోట్లు సంపదను కోల్పోయారు.
ఈ అక్రమ వ్యాపారానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆడమ్ యంగ్ , హారిసన్ గెవిర్ట్జ్ అనే ఇద్దరు అమెరికన్లు తమ తప్పును అంగీకరించారు. వీరు నడుపుతున్న టెలికాం కంపెనీ ద్వారానే ఈ మోసపూరిత కాల్స్ రూటింగ్ అయ్యేవి. విచారణలో భాగంగా ఐదుగురు భారతీయులు సాహిల్ నారంగ్, చిరాగ్ సచ్‌దేవా, అబ్రార్ అంజుమ్, మనీష్ కుమార్ , జగమీత్ సింగ్ విర్క్ ఇప్పటికే దోషులుగా తేలారు. తమ స్వార్థం కోసం వృద్ధుల జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఈ నిందితులకు జూన్ 16, 2026 న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.
వృద్ధులు గౌరవానికి, రక్షణకు అర్హులు.. వారిని లక్ష్యంగా చేసుకుంటే శిక్ష తప్పదు అని ఎఫ్‌బీఐ బాస్టన్ విభాగం హెచ్చరించింది. ఈ స్కామర్లు కేవలం డబ్బునే కాదు, బాధితుల మానసిక ప్రశాంతతను కూడా హరించారని దర్యాప్తు అధికారులు తీవ్రంగా ఖండించారు. ప్రతి కాల్ వెనుక ఒక అమాయక వ్యక్తి అవమానానికి, ఆర్థిక విధ్వంసానికి గురవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రోడ్ ఐలాండ్ అనే చిన్న ప్రాంతంలోనే బాధితులు సుమారు 5.7 మిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారంటే ఈ మోసం ఎంత విస్తృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారత్-అమెరికా మధ్య ఉన్న సహకారంతో ఇలాంటి కాల్ సెంటర్లపై నిరంతరం దాడులు జరుగుతున్నా, కొత్త రూపాల్లో ఈ ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్‌లను ఛేదించడం ద్వారా డిజిటల్ భద్రతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ఎఫ్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేసు ద్వారా భారత్‌లోని నకిలీ కాల్ సెంటర్ల నిర్వహకులకు, వారికి సహకరించే విదేశీ శక్తులకు గట్టి హెచ్చరిక పంపినట్లయింది.
