Fake RPF SI Arrest: ఆర్పీఎఫ్ ఎస్సై అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ యువతి ఇచ్చిన షాక్‌కి పోలీస్ శాఖ మొత్తానికి దిమ్మతిరిగి పోయింది. దాదాపు ఏడాది నుంచి ఆర్పీఎఫ్ ఎస్సైగా చెలామణి అవుతోంది మాళవిక అనే యువతి. నార్కట్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నట్టు కుటుంబసభ్యులతోపాటు అందరినీ నమ్మించింది. రోజు మొత్తం యూనిఫామ్‌లోనే తిరుగుతుంది. దేవాలయాలకు కూడా యూనిఫామ్‌లోనే వెళ్తుంది. ప్రముఖులను కలిసి ఫోటోలు దిగుతుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. పెళ్లి చూపులకు కూడా పోలీస్ డ్రెస్‌లోనే వెళ్లింది. అదే ఆమె కొంప ముంచింది. అబ్బాయి తరపు వాళ్లు ఉన్నతాధికారులను ఆరా తీయగా... అసలు విషయం బయటపడింది. మాళవిక నకిలీ ఎస్సై అన్న గుట్టు రట్టయ్యింది. ఆమె... కటకటాల వెనక్కి వెళ్లింది.
అసలు ఏం జరిగిందంటే...?
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ (RPF) ఎస్ఐ పరీక్ష రాసింది. దాదాపుగా అన్ని అర్హతలు సాధించింది. కానీ మెడికల్ టెస్ట్‌లో దృష్టి లోపం కారణంగా.. ఆమె తిరస్కరణకు గురైంది. దీంతో చాలా బాధపడింది. అంతేకాదు... అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు కూడా తాను ఎస్ఐ అవుతున్నట్టు చెప్పుకుంది. ఉద్యోగం రాలేదని చెప్తే పరువు పోతుందని భావించిన మాళవిక... ఉద్యోగం వచ్చినట్టు తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను నమ్మించింది. ఎస్ఐ యూనిఫాం కుట్టించుకుంది. నకిలీ ఐడి కార్డ్ చేయించుకుంది. నార్కట్‌పల్లి గ్రామంలో ఎస్సైగా పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది. శంకర్‌పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. ఉదయం యూనిఫామ్ వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి... మళ్లీ రాత్రికి యూనిఫామ్‌లోనే ఇంటికి వచ్చేంది. యూనిఫాంలోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం చేసింది.
కటకటాల వెనక్కి నెట్టిన పెళ్లిచూపులు
ఉద్యోగం వచ్చింది... ఇక పెళ్లిచేద్దామనుకుని మాళవికకు ఎంతో ఆశతో సంబంధాలు చూశారు తల్లిదండ్రులు. పెళ్లిచూపులు ఫిక్స్ చేశారు. దీంతో... పెళ్లిచూపులకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది మాళవిక. అక్కడే దొరకిపోయింది. అబ్బాయి తరపువాళ్లు పైఅధికారులను సంప్రదించగా... మాళవిక మోసం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. నకిలీ ఆర్పీఎఫ్ పోలీసుగా చెలామని అవుతున్న మాళవికను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం రాలేదని చెప్తే తల్లిదండ్రులు బాధపడతారని ఇలాంటి పని చేసినట్టు చెప్తోంది మాళవిక. దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆమె నకిలీ ఎస్సైగా చెలామణి అవుతోందని జీఆర్పీ (GRP), ఆర్పీఎఫ్ (RPF) పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి... రిమాండ్‌కు తరలించారు. ఎస్సైగా చెప్పుకుంటూ ఇంకేమైనా మోసాలకు పాల్పడిందా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు పోలీసులు.
యూనిఫామ్‌లోనే రీల్స్
ఎస్సై కావాలన్న కల నెరవేరక పోవడంతో... నకిలీ ఎస్సైగా చలామణి అయిన మాళవిక... ఎప్పుడూ యూనిఫామ్‌లోనే ఉండేది. పోలీస్ యూనిఫామ్‌లో ఆమె రీల్స్ కూడా చూసింది. ఆ రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసింది. యూనిఫామ్‌లో వీఐపీలతో ఫొటోలు దిగి... వాటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏడాది పాటు సాగుతున్న నకిలీ ఎస్సై బాగోతం... చివరికి బట్టబయలైంది. ఆమె చేసిన పనికి పోలీసులు కూడా షాకయ్యారు. ప్రస్తుతం మాళవిక రిమాండ్‌లో ఉంది. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.