కేటుగాళ్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. ఎవరు ఏ రూపంలో వచ్చి మోసం చేస్తారో తెలియదు. అయితే ఇందులో మహిళల పాత్ర ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాంటి ఓ మహిళే అశ్విని.


గుడిసెల అశ్విని పేరు చెప్పగానే మోసపోయిన వాళ్లకు ఓ క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. కానీ తెలియని వారు మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిన చీటింగ్‌ ఉమెన్ ఆమె. 


అశ్విని చదివింది ఇంటరే. కానీ కంత్రీ ప్లానింగ్‌లో ఆమె పీహెచ్‌డీ చేసింది. సావాస దోషం అంటారు కదా ఈమె స్టోరీలో అది పక్కగా సూట్ అవుతుంది. అదేంటో ఆమె ప్రేమలో పడినోళ్లంతా కేటుగాళ్లే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె అలా ఎంచుకుటుందా... లేకుంటే దీపం బుడ్డీలో వచ్చి పడ్డ పురుగుల్లా వాళ్లే వచ్చి వాలుతున్నారో పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. 
ఇంటర్ చదివిన అశ్వినికి మంచి రాయల్ లైఫ్ లీడ్ చేయాలనే కోరిక ఉంది. అందుకే రోహిత్ శర్మ అనే వ్యక్తిని ప్రేమించింది. అతగాడు కూడా చేతి వాటం కలిగి వ్యక్తే. ఇళ్లల్లో చోరీలు చేసి మస్తు పైసల్ కూడబెట్టాడు. అతడ్ని లైన్‌లో పెట్టిన అశ్విని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి పిల్లల్ని కూడా కనింది. 


కొన్ని రోజులకు అశ్విని, రోహిత్‌ శర్మ మధ్య విభేదాలు వచ్చాయి. అంతే వాడ్ని వదిలేసింది. తర్వాత మరో రోహిత్‌ను పట్టుకుంది. ఈసారి పట్టుకుంది రోహిత్ శర్మను కాదు... సింగ్‌ను. అవును రోహిత్‌ సింగ్‌తో సహజీవనం చేసింది. కొన్ని రోజుల తర్వాత అతడూ బోర్ కొట్టేశాడో ఏమో మళ్లీ మరో వ్యక్తిని పట్టుకుంది. ఈసారి అభిషేక్‌పై వల వేసింది. 


ప్రస్తుతం అభిషేక్‌తోనే కలిసి ఉంటుంది అశ్నిని. అతడు బైక్‌ దొంగ. ఇన్నిర రోజులు వీళ్ల ఇద్దరి టైం నడిచింది. మూడు బైక్‌లు ఆరు చక్రాల్లా సాగిపోయిందీ వీరి చోరీల బిజినెస్. ఓ ఫైన్ మార్నింగ్‌ అభిషేక్‌ పోలీసులకు చిక్కాడు. అంతే బాబాయ్‌లు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. 


అభిషేక్‌ జైలుకు వెళ్లడంతో మేడం అశ్విని పరిస్థితి దారుణంగా తయారైంది. చేతిలో డబ్బుల్లేవు. అప్పటి వరకు అనుభవించిన లైఫ్ ఒక్కసారి తలకిందులైపోయింది. వేరే పని చేతకాదు. అందుకే మరో స్మార్ట్ మూవ్‌ వేసింది. వెంటనే తెలిసిన వాళ్ల వద్దకు వెళ్లి ఖాకీ డ్రెస్ కొనుక్కుంది. వెంటనే పోలీస్ అయిపోయింది. 


విలాసాలకు అలవాటు పడిన అశ్విని నకిలీ పోలీస్‌గా అవతారమెత్తింది. ఐడీ కార్డుతోపాటు అన్నీ సెటప్ చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నానంటూ దొరికిన వారందర్నీ బాదేసింది. ఇలా అశ్విని పోలీస్‌ అవతారంలో నకిలీ డ్యూటీలు చేస్తున్న టైంలో రాకేష్‌ నాయక్ పరిచయ్యాడు. 


లంగర్‌హౌస్‌కు చెందిన రాకేష్‌ నాయక్‌కు మాయమాటలతో బుట్టలో వేసింది అశ్విని. తనకు నాంపల్లి కోర్టులో సీనియర్ అడ్వకేట్‌లు తెలుసని కలరింగ్ ఇచ్చింది. అక్కడ వాళ్లకు అసిస్టెంట్‌లు కావాలంటూ కోతలు కోసింది. ఖాకీడ్రెస్‌లో ఉన్న ఆమెను చూసిన రాకేష్‌ అదంతా నమ్మేశాడు. శాలరీ ఎంత ఉంటుందని అడిగాడు. 20 నుంచి 25 వేలు ఉంటుందని చెప్పింది. దీనికి మధ్యవర్తులకు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందని గుగ్లీలు వదిలింది. 


అశ్వినీ స్వీట్‌ వాయిస్ చెప్పిన మాటలకు రాకేష్‌ పడిపోయాడు. ముందుగా అడ్వాన్స్ కింద 30 వేలు సమర్పించుకున్నాడు. డబ్బులు అందగానే అశ్విని జంప్. ఫోన్ స్విచ్చాఫ్‌. అసలు విషయం తెలియని రాకేష్‌ కంగారు పడ్డాడు. వెంటనే తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడుగాని అశ్విని అసలు రూపం తెలియలేదు. పోలీసులు కేసును టేకప్ చేసి ఆమెను అరెస్టు చేశారు. తర్వాత విచారణను లంగర్‌హౌస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.