తిరుపతి జిల్లా డీఎస్పీగా అవతారమెత్తి, కంపెనీల్లో పెట్టు బడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ ఈఓడబ్ల్యూ బృందం అరెస్ట్ చేసింది. 2021 నుంచి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కొండూరు రెడ్డి వెంకట్ రాజు (40) అలియాస్ కేవీపీ రాజు, డీఎస్పీ రాజుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేవీపీ రాజు, అతని ముఠా సభ్యులు తాము సీనియర్ పోలీస్ అధికారులమంటూ ప్రచారం చేసుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలువుర్ని లక్ష్యంగా చేసుకునేవారు. ఉనికిలో లేని నకిలీ కంపెనీలను అసలుసిసలైన కంపెనీలుగా పేర్కొంటూ.. పెట్టుబడులు పెడితే స్వల్పకాలం లోనే భారీ లాభాలు వస్తాయని నమ్మించే వారు. బాధితులకు నమ్మకం కలిగించేందుకు సెక్యూరిటీ పేరుతో నకిలీ ఆస్తి పత్రాలు, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేవారు.
ఎన్కౌంటర్ స్పెషలిస్టులం అంటూ బెదిరింపులుఅనంతరం గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకునేవారు. బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీస్తే తాము ఎన్ కౌంటర్ స్పెషలిస్టుల మంటూ బెదిరింపులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ బాధితుడి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసి మోసం చేయడంతో అతని ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 406, 420, 170 సెక్షన్లతో పాటు 34 ఐపీసీ కింద కేసు నమోదైంది. నిందితుడు కేవీపీ రాజుపై గతంలోనే మరో 3 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 419, 420 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద, హైదరాబాద్లోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో 420, 468, 471 r/w 120(B) ఐపీసీ సెక్షన్ల కింద, నెల్లూరు జిల్లా వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో 420, 406, 468, 170 r/w 120(B) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అధిక లాభాలు ఇప్పిస్తామంటూ వచ్చే నకిలీ వాగ్దానాలు, ప్రచారాలను నమ్మి ప్రజలు తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి మోసపోవద్దని హైదరాబాద్ సీసీఎస్ డిప్యూటీ కమిషనర్ ప్రజలకు సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంస్థలు, వ్యక్తుల విశ్వసనీయత, డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు.
