కొబ్బరి వ్యాపారుల వద్ద నుండి రూ. 10 లక్షల అసలు నగదును దొంగిలించారు. వీరు తాము పోలీసులమని బెదిరించి ఈ డబ్బును లాక్కొని పరారయ్యారు.
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో కొబ్బరికాయల వ్యాపారుల వద్ద దొంగనోట్ల ముఠా ఏఎస్ఐ లోకనాథం, కానిస్టేబుల్ రవిల సహకారంతో రూ.10 లక్షల అసలు నగదును దోచుకుంది. నిందుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

- దొంగనోట్ల ముఠా పోలీసులమని బెదిరించి ₹10 లక్షలు దోచుకుంది.
- నకిలీ నోట్ల ముఠాతో కలిసి ఇద్దరు పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారు.
- ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, గంటల్లోనే ముఠాను, సహకరించిన వారిని పట్టుకున్నారు.
- దొంగనోట్ల ముఠాతో పాటు సహకరించిన పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు (జీడి నెల్లూరు) పరిధిలో దొంగనోట్ల ముఠా కలకలం రేపింది. తాము పోలీసులం అని బెదిరించి. కొబ్బరికాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యాపారుల వద్ద నుంచి రూ. 10 లక్షల అసలు నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయమేమిటంటే.. దొంగనోట్లు మార్పిడి చేసే ఈ ముఠాతో చేతులు కలిపి చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐ లోకనాథం, ఏఆర్ కానిస్టేబుల్ రవి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దొంగలతో కలిసి దోపిడీకి ప్లాన్ చేయడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఫేక్ కరెన్సీ గ్యాంగ్‌తో చేతులు కలిపిన పోలీసులు
పోలీసుల వివరాల ప్రకారం.. జీడి నెల్లూరు మిట్ట హరిజనవాడకు చెందిన సెల్వం, దేవా, తమిళనాడులోని వేలూరుకు చెందిన ఇళంగోవన్, చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్సై లోకనాథం, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రవి కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. తాము తక్కువ ధరకే దొంగనోట్లు ఇస్తామంటూ తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మంజు, విజయ్ అనే వ్యక్తులకు ఎర వేశారు. పది లక్షలు ఇస్తే అందుకు కోటి రూపాయల ఫేక్ కరెన్సీ ఇస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితులు రూ. 10 లక్షల అసలు నగదు తీసుకుని వారు చెప్పినట్లుగానే గంగాధర నెల్లూరుకు వచ్చారు. బాధితులు అక్కడికి చేరుకోగానే.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఏఎస్ఐ, కానిస్టేబుల్ రంగంలోకి దిగి తాము పోలీసులమంటూ బెదిరించి వారి వద్ద ఉన్న రూ. 10 లక్షల క్యాష్‌ను బలవంతంగా లాక్కొని ముఠాతో కలిసి పరారయ్యారు.
ఈ మోసంపై బాధితులు వెంటనే జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము కేవలం కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం కొనుగోలు చేయడానికి వస్తే.. కొందరు పోలీసులం అని బెదిరించి, దొంగనోట్ల ముఠాతో కలిసి తమను మోసం చేశారని వాపోయారు. బాధితుల ఫిర్యాదుపై గంగాధర నెల్లూరు సీఐ ప్రసాద్ తక్షణమే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం గంటల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠా సభ్యులతో పాటు వారికి సహకరించిన పోలీసులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బట్టుకండిగ గ్రామం వద్ద ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సహా ముఠా సభ్యులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీఐ ప్రసాద్.. నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.
Before You Go
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
Frequently Asked Questions
గంగాధర నెల్లూరులో కొబ్బరి వ్యాపారుల వద్ద నుండి ఎంత నగదును దొంగిలించారు?
ఈ దొంగనోట్ల ముఠాకు ఎవరు సహకరించారు?
చిత్తూరు ట్రాఫిక్ ఏఎస్ఐ లోకనాథం మరియు ఏఆర్ కానిస్టేబుల్ రవి ఈ దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడ్డారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఈ దోపిడీలో పాల్గొన్నారు.
దొంగనోట్ల ముఠా బాధితులను ఎలా మోసం చేసింది?
తాము తక్కువ ధరకే దొంగనోట్లు ఇస్తామని నమ్మించి, రూ. 10 లక్షలు తీసుకున్నారు. తర్వాత తాము పోలీసులమని చెప్పి, బాధితుల వద్ద ఉన్న అసలు నగదును కూడా లాక్కొని పారిపోయారు.
పోలీసులు ఎంత సమయంలో దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు?
బాధితుల ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే పోలీసులు దొంగనోట్ల ముఠా సభ్యులతో పాటు వారికి సహకరించిన పోలీసులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు























