ఒకప్పుడు తెల్గీ స్టాంపుల కుంభకోణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత సంచలనం సృష్టించిందో... ప్రస్తుతం ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలానాల స్కాం అంత కంటే ఎక్కువ సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. తనిఖీలు చేస్తున్న కొద్దీ నకిలీ చలాన్ల కేసులు బయట పడుతున్నాయి. రూ. కోట్లు ప్రభుత్వం ఖాతాలో చేరాల్సి ఉన్నా.. అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోయాయని తేలింది.
సాఫ్ట్‌వేర్ లొసుగు అడ్డం పెట్టుకుని రిజిస్ట్రేషన్ల చలాన్ల రీ సైక్లింగ్
కడప సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కుంభకోణం మొదటి సారిగా వెలుగు చూసింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు చలాన్లను సీఎంఎఫ్ఎస్‌కు అనుసంధానం చేశారు. ప్రజలు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చెల్లించే చలానాల రీసైక్లింగ్ చేయడం ప్రారంభించినట్లుగా ఈ విధానంతో తేలింది. సాఫ్ట్ వేర్‌లో ఉన్న లొసుగుల ఆధారంగా కొందరు డాక్యుమెంట్ రైటర్లతో కలిసి సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కయి ఈ అక్రమాలకు ప్లాపడ్డారు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకుల్లో చలానా తీసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాక..కొందరు అవే చలానాలను మళ్లీ వినియోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. సీఎం ఎఫ్‌ఎస్‌లో సాంకేతిక లోపాన్ని ఆసరా చేసుకుని ఉద్యోగులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.
తనిఖీ చేసిన ప్రతీ చోటా బయటపడుతున్న స్కాం..!
సర్కార్ ఖజానాకు చేరాల్సిన కోట్లు వారి జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఆరు నెలల క్రితమే కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ స్కాం బయటపడింది. జూన్, జులై నెలల్లో ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్లు సరిగ్గా పని చేయలేదు. ఆ సమయంలో ఈ చలానాల దోపిడీకి తెరదీశారు. వారం క్రితం కడప జిల్లాలోనూల ఇదే తరహా స్కాం బయటపడింది. అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాలు చేయాలని ఆదేశించారు. 2018నుంచి ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన చేపట్టారు. కర్నూలు, కడప జిల్లాల్లో పలువురు సబ్ రిజిస్ట్రార్లపైనా వేటు వేశారు. ఇప్పటి వరకూ ఏపీ వ్యాప్తంగా దాదాపుగా 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసనట్లుగా తెలుస్తోంది. సుమారుగా రూ. ఆరు కోట్ల రూపాయల విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది. అయితే ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించారు. అసలు లోతుకు వెళ్లే కొద్దీ ఈ స్కాం ఎంత పెద్దదో అంచనా వేయడం కష్టమని అంటున్నారు.
సీఐడీ విచారణ చేయించే యోచనలో ఏపీ ప్రభుత్వం..!
ప్రభుత్వం ఈ అంశంపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. తనిఖీలు చేసే కొద్దీ పెద్ద ఎత్తున అక్రమాలు బయట పడుతూండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా మోసం చేశారు.. ఎన్ని కోట్ల మేర ఈ స్కాం జరిగి ఉంటుందో తెలుసుకున్నారు. తక్షణం బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజాధనాన్ని రికవరీ చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.