Krishna Crime News | చల్లపల్లి: కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఎస్సై సహా నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. బయట నుంచి స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రిని లేదా బాణసంచా వస్తువులను పరిశీలన కోసం స్టేషన్‌లోకి తీసుకువచ్చిన సమయంలో మంగళవారం ఉదయం ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఎస్సైతో పాటు పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన పోలీసులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Continues below advertisement

ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ ఆవరణ దద్దరిల్లిపోయింది. స్టేషన్ లోపల ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అవ్వడమే కాకుండా, బయట నిలిపి ఉంచిన వాహనాలు కూడా ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. చుట్టుపక్కల కొంతదూరం వరకు భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు సైతం పోలీస్ స్టేషన్ కు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే చల్లపల్లి సీఐ కేఎస్ రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అసలు మందుగుండు సామగ్రిని స్టేషన్‌లోకి ఎందుకు తెచ్చారు? పేలుడుకు దారితీసిన ఖచ్చితమైన కారణాలేంటి? అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పీఎస్‌లో ఒక్కసారిగా పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Continues below advertisement

పోలీసు స్టేషన్ లో పేలుడు ఘటనపై స్పందించిన హోం మంత్రి అనిత

కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్న ఆమె జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా సహా ఇతర సిబ్బందికి తక్షణం మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడలోని ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను సూచించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను సేకరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు.