రాష్ట్రంలో సైబర్ నేరాల మినహా అన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయని అన్నారు డీజీపీ అంజనీ కుమార్. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ క్రైం కూడా అంటే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్, ఫంక్షనల్ వర్టికల్స్‌పై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. సైబర్ నేరాల బారిన పడిన వారు అందించే ప్రతీ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేరాల నమోదు నిర్దారిత ప్రమాణాలలోనే ఉన్నాయని, వ్యక్తిగత నేరాలు మినహా మిగిలిన నేరాలన్నింటిలోనూ తగ్గుదల ఉందని తెలిపారు.
ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీసుశాఖ పారదర్శకంగా సేవలందిస్తూ మన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా తెలంగాణ పోలీసుల గౌరవం మరింత ఇనుమడించేలా పని చేయాలని సూచించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన ఆయుధంగా మారిన సీసీ టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అన్ని జిల్లాల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
డీజీపీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ చేసిన ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 700 పోలీస్ స్టేషన్లలో 330 పోలీస్ స్టేషన్లు అద్భుతమైన పని తీరును కనపర్చాయని అన్నారు. ఇదే విధంగా ఉత్తమ సేవలందించేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్ల పనితీరును రెగ్యులర్‌గా సమీక్షించాలని సీపీలను, ఎస్పీలను కోరారు. బ్లూ కోట్స్ పనితీరు అంశంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పలు కమీషనరేట్లను, ఎస్పీలను డీజీపీ అభినందించారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ ఉపయోగించడంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ఆదేశించారు.
నేరపరిశోధనలో ఉత్తమ ప్రతిభ చూపినవారికి సత్కారం
సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల POSCO కేసు విషయంలో త్వరిత గతిన దర్యాప్తు పూర్తిచేసి నిందితునికి 20 ఏళ్ల శిక్ష, నగదు జరిమానా విధించడంతో కృషిచేసిన దర్యాప్తు అధికారులు ప్రతాప్ రెడ్డి, బంజారాహిల్స్ SHO నరేందర్ ను డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. పుష్పగుచ్చంతోపాటు ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలికపై అత్యాచారానికి సంబందించిన కేసును దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడడంలో కృషిచేసిన అడిషనల్ డీసీపీ శివ కుమార్, SHO నరేందర్ గౌడ్ లను డీజీపీ సన్మానించారు. అదేవిధంగా, శివసాగర్ అనే నిందితున్ని 18 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఇన్‌స్పెక్టర్లు వెంకటేష్, శ్రీనివాస్, ఎస్.పీ రాంరెడ్డి లను కూడా డీజీపీ ఈ సందర్భంగా సన్మానించారు.